నెదర్లాండ్ లోనూ బాలరాముడి ప్రతిష్ఠ!
కాశీలో రూపొందిన విగ్రహం అయోధ్య మందిరంలో ప్రత్యేక పూజల అనంతరం తరలింపు మరిన్ని దేశాల నుంచి ఆ తరహా విగ్రహాలకు భారీ డిమాండ్
వారణాసి: నెదర్లాండ్ లో మరో బాలరాముడిని ప్రతిష్ఠించనున్నారు. ఇందుకు సంబంధించిన విగ్రహాన్ని కాశీలో రూపొందించారు. ఈ విగ్రహాన్ని తొలుత అయోధ్య బాలరాముని ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించి అనంతరం నెదర్లాండ్ కు తరలించనున్నారు. అక్కడి ఆలయంలో ప్రతిష్ఠాపన చేయనున్నారు. ఈ విషయాన్ని ఇంటర్నల్ బ్లిస్ ఫౌండేషన్ డైరెక్టర్ రాహుల్ ముఖర్జీ శనివారం తెలిపారు. బాలరాముడి రెండోరూపమే తాము ప్రతిష్ఠించబోయే విగ్రహం అన్నారు. శిల్పి కన్హయ్యలాల్ శర్మ పది మంది సహచరులతో కలిసి ధెల్వారియాలోని విగ్రహాల కర్మాగారంలో ఈ విగ్రహాన్ని రూపొందించారు.
విగ్రహానికి రూపం కల్పించేందుకు రెండు నెలల సమయం పట్టిందన్నారు. విగ్రహా రూపకలపనలో నల్లటి గ్రానైట్ రాయి వినియోగించామన్నారు. ఈ విగ్రహాన్ని నెదర్లాండ్ లోని హనుమాన్ ఆలయంలో ఏర్పాటు చేయనున్నట్లు రాహుల్ ముఖర్జీ వివరించారు.
నెదర్లాండ్ లోనే గాకుండా, జర్మనీ, ఇటలీ, అమెరికా, కెనడా, బెల్జియం, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో కూడా అయోధ్య బాలరాముడిని పోలిన విగ్రహాల ఆర్డర్ లు వచ్చాయని శిల్పి కన్హయ్యలాల్ శర్మ వివరించారు. ప్రస్తుతం ఈ తరహా విగ్రహాల డిమాండ్ ప్రపంచవ్యాప్తంగా ఉందన్నారు. కన్హయ్యలాల్ మూడు తరాలు విగ్రహాల తయారీలోనే నిమగ్నమయ్యారు. దేశ విదేశాల్లోనూ ప్రముఖుల విగ్రహాలను అచ్చుగుద్దినట్లు రూపొందించడంలో ఈయన కుటుంబం సిద్ధహస్తులుగా పేరు ప్రఖ్యాతులు గాంచారు.