బీజేపీ 12వ జాబితా విడుదల ఏడుగురి ఛాన్స్
బీజేపీ 2024 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి 12వ జాబితా విడుదల చేసింది.
మహారాష్ట్ర, పంజాబ్, యూపీ, ప. బెంగాల్ లకు ఎంపీ అభ్యర్థుల ప్రకటన
నా తెలంగాణ, న్యూఢిల్లీ: బీజేపీ 2024 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి 12వ జాబితా విడుదల చేసింది. మంగళవారం ఏడుగురితో కూడిన ఈ జాబితాను పార్టీ సీనియర్ నేత అరుణ్ సింగ్ ఎక్స్ మాధ్యమంగా ప్రకటించారు. మహారాష్ట్రలోని ఒక లోక్‌సభ స్థానంతో పాటు, పంజాబ్‌లో మూడు, ఉత్తరప్రదేశ్‌లో రెండు, పశ్చిమ బెంగాల్‌లోని ఒక స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపారు.
మహారాష్ట్రలోని సతారా లోక్‌సభ స్థానం నుంచి ఛత్రపతి ఉదయన్‌రాజే భోంస్లే, పంజాబ్‌లోని ఖదూర్ సాహిబ్ నుంచి మంజీత్ సింగ్ మన్నా మియావింద్, హోషియార్‌పూర్ (ఎస్‌సీ) నుంచి అనితా సోమ్ ప్రకాష్, భటిండా నుంచి పరంపాల్ కౌర్ సిద్ధ్ (మాజీ ఐఏఎస్)కి టికెట్ ఇచ్చారు. యూపీలో డియోరియా స్థానం నుంచి శశాంక్ మణి త్రిపాఠి, ఫిరోజాబాద్ స్థానం నుంచి ఠాకూర్ విశ్వదీప్ సింగ్ బరిలోకి దిగారు. పశ్చిమ బెంగాల్‌లోని డైమండ్ హార్బర్ లోక్‌సభ స్థానం నుంచి అభిజిత్ దాస్ (బాబీ)కి బీజేపీ టిక్కెట్టు ఇచ్చింది. ఇక్కడ ఆయన తృణమూల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, సిట్టింగ్ ఎంపీ అభిషేక్ బెనర్జీతో తలపడనున్నారు.