బీసీ డిక్లరేషన్ అమలు చేయాలి
కలెక్టరేట్ వద్ద నిరసన బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ర్ట అధ్యక్షుడు ఆనంద్ గౌడ్, బీజేపీ రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి, కోశాధికారి శాంతి కుమార్
నా తెలంగాణ, హైదరాబాద్: బడ్జెట్ లో కామారెడ్డిలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్ ను వెంటనే అమలు చేయాలని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ర్ట అధ్యక్షులు ఆనంద్ గౌడ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం హైదరాబాద్ కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి, కోశాధికారి శాంతి కుమార్, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కాంగ్రెస్ ప్రకటించిన బడ్జెట్ లో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని శాంతికుమార్ మండిపడ్డారు. అవాస్తవాల పునాదులపై గెలిచిన కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్ ను అమలు చేయకుండా తప్పించుకుంటోందని ఆరోపించారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు 23 నుంచి 42 శాతానికి పెంచుతామని ఇంతవరకూ పెంచకపోవటం ఏంటని? నిలదీశారు.
మహాత్మ జ్యోతిబాపూలే సబ్ ప్లాన్ కింద ప్రతి ఏటా రూ.20వేల కోట్ల అంటూ హామీ ఇచ్చి, బడ్జెట్ లో అన్యాయం చేశారన్నారు. బీసీ యువత చిరు వ్యాపారాలు నిర్వహించుకునేందుకు, ఉన్నత విద్య కోసం రూ.10 లక్షల వరకు పూచీకత్తు లేని, వడ్డీలేని రుణాలు ఇస్తామని చెప్పి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేవరకు బీజేపీ పోరాటం కొనసాగిస్తుందని శాంతికుమార్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.