బంగ్లాలో మహిళలు, పిల్లలపైన దాడులు
సీడీపీహెచ్ ఆర్ నివేదిక వెల్లడి
ప్రపంచదేశాలు మౌనం
ఆకృత్యాలను అరికట్టేందుకు ఒత్తిడి చేయాలి
యూనస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం
నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: బంగ్లాదేశ్ లో హిందువులు, మైనార్టీలపై జరుగుతున్న దాడుల్లో ముష్కరులు మహిళలు, పిల్లలపై కూడా ఆకృత్యాలకు, దాడులకు పాల్పడుతున్నారని సీడీపీహెచ్ఆర్ (సెంటర్ ఫర్ డెమోక్రసీ, ఫ్లూరలిజం అండ్ హ్యూమన్ రైట్స్) శుక్రవారం నివేదికను వెల్లడించింది. ఈ దేశంలో హిందువులు తీవ్ర హింసకు గురవుతున్నారని ఈ నివేదిక స్పష్టం చేసింది. హిందువులకు ఏం జరిగినా అది ప్రపంచం మొత్తాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉందన్నారు. బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత ప్రపంచంలోని పెద్ద దేశాలపై ఉందని, తద్వారా హిందువులపై జరుగుతున్న అకృత్యాలను అరికట్టవచ్చని స్పష్టం చేశారు. ప్రపంచ దేశాలు ఈ ఆకృత్యాలపై మౌనం వహించడం సరికాదన్నారు. షేక్ హసీనా గద్దె దిగాక నాలుగు రోజుల్లోనే 190 దాడులు జరిగాయన్నారు. 16 దేవాలయాలను ధ్వంసం చేశారని, 69 దేవాలయాలను పూర్తిగా కూల్చివేశారని, 2వేల మంది హిందువులపై కేసులు నమోదు చేశారని నివేదికలో పేర్కొన్నారు. ఈ హింస ఇప్పటికే తగ్గడం లేదన్నారు. హింసను అడ్డుకోవడంలో తాత్కాలిక యూనస్ ప్రభుత్వం కూడా పూర్తిగా విఫలమయిందని నివేదికలో ఆరోపించారు. బంగ్లాదేశ్ నుంచి హిందువులను అంతం చేయాలనే ఉద్దేశ్యం ఈ చర్యల వెనుక కనిపిస్తోందని నివేదికలో పేర్కొన్నారు.