నిర్ణీత సమయంలో విచారణ
అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టిన టీఎంసీ
ప్రతిపక్షాలను సంప్రదించరా?
బీజేపీ సుభేందు అధికారి ప్రశ్న
బిల్లుకు పూర్తి మద్దతు
ఆందోళనలకు భయపడే అసెంబ్లీలో బిల్లు
కోల్ కతా: మహిళలు, పిల్లలపై జరిగే ఆకృత్యాలను అరికట్టేందుకు అత్యాచార నిరోధక బిల్లును పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లు ప్రకారం నెలరోజుల్లో విచారణ, 10 రోజుల్లో ఉరిశిక్షను విధించనున్నారు. ఈ బిల్లును మంగళవారం టీఎంసీ న్యాయశాఖ మంత్రి మోలోయ్ ఘటక్ ప్రవేశపెట్టారు. ‘అపరాజిత మహిళలు మరియు పిల్లల బిల్లు (పశ్చిమ బెంగాల్ క్రిమినల్ చట్టం మరియు సవరణ) బిల్లు 2024 బిల్లు ద్వారా లైంగిక నేరాలకు సంబంధించి కేవలం నెల రోజుల్లో విచారణ 10 రోజుల్లో ఉరిశిక్ష విధించే నిబంధనను కల్పించారు. అత్యాచారానికి పాల్పడిన వారికి బెయిల్ రాకుండా జీవిత ఖైదు విధించే నిబంధన కూడా ఈ బిల్లులో పొందుపరిచారు. కోల్ కతా ఆర్జీకర్ మెడికో అత్యాచారం, హత్యపై రోజురోజుకు నిరసనలు పెల్లుబుకుతుండడంతో మమత సర్కార్ దిద్దుబాటు చర్యలకు దిగినట్లు కనబడుతోంది. అయితే బిల్లుపై చర్చకు సుధీర్ఘ సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ బిల్లును ఏ పార్టీలతో సంప్రదింపులు జరపకుండా ఏకపక్షంగా అసెంబ్లీలో ప్రవేశపెట్టారని బీజేపీ నేత శుభేందు అధికారి మండిపడ్డారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో కాసేపు గందరగోళం ఏర్పడింది.
అత్యాచార నిరోధక బిల్లుకు సంబంధించి బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత సుభేందు అధికారి మాట్లాడుతూ.. టీఎంసీ హడావుడిగా ఈ బిల్లును తీసుకొచ్చిందని అన్నారు. ఆందోళనలు జరుగుతున్న తీరును చూసి భయడే బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారని ఆయన ఆరోపించారు. అయితే ఈ బిల్లును వీలైనంత త్వరగా అమలు చేయాలని కోరుతున్నామని డిమాండ్ చేశారు. తమకు మహిళలు, బాలికల భద్రతే ముఖ్యమన్నారు. బిల్లును ప్రవేశపెట్టేముందు నియమ నిబంధనల ప్రకారం అన్ని పార్టీలను సంప్రదించాల్సి ఉంటుందన్నారు. ఏది ఏమైనా ఈ బిల్లుపై ప్రశ్నలు లేవనెత్తడం తనకిష్టం లేదన్నారు. ఈ బిల్లులే కొత్త అంశం ఏమీ లేదని ఆరోపించారు.