కాంగ్రెస్ పార్టీ ఆఫీసుల్లో ప్రింటింగ్ మిషన్లు ఉన్నాయా?: కిషన్ రెడ్డి
Are there printing machines in Congress party offices? Union Minister Kishan Reddy asked
- హామీలకు కొదవ లేదు కానీ.. అమలుకు డబ్బులేవి?
- అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకే దిక్కులేదు
- గ్యారంటీలు, డిక్లరేషన్ల పేరుతో కాంగ్రెస్ మోసం చేసింది
- కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన హామీలు ముందు అమలు చేయాలి
- బాబూ జగ్జీవన్ రామ్‌ను ప్రధాని కాకుండా కాంగ్రెస్ అడ్డుకున్నది
- కాంగ్రెస్ అప్రజాస్వామిక విధానాలను జగ్జీవన్ రామ్ వ్యతిరేకించారు
- అంబేద్కర్ ను కూడా ఎన్నికల్లో ఓడించిన పార్టీ కాంగ్రెస్
- దళితులకు వ్యతిరేకంగా పని చేసింది.. చేస్తున్నది ఆ పార్టీ
- బాబూ జగ్జివన్ రామ్ జయంతిలో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
నా తెలంగాణ, హైదరాబాద్: గ్యారంటీలు, డిక్లరేషన్ల పేరుతో అమలుకు సాధ్యం కాని హామీలు ఇస్తున్న కాంగ్రెస్.. వాటికి నిధులు ఎక్కడి నుంచి తెస్తుందని కేంద్ర మంత్రి, బీజేపీ సీట్ చీఫ్ జి.కిషన్ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోపై ఆయన స్పందించారు. హామీల అమలుకు డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారో తెలియడం లేదని.. బహుశా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్‌లో నోట్ల ముద్రణ ఏమైనా చేస్తారేమోనని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. శాసనసభ ఎన్నికల్లో డిక్లరేషన్ పేరుతో ఇచ్చిన అనేక హామీల అమలును మరిచిన కాంగ్రెస్.. చిత్తశుద్ధి ఉంటే ముందు వాటిని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ‘‘యూత్ డిక్లరేషన్, మహిళా డిక్లరేషన్, ఎస్సీ.. ఎస్టీ డిక్లరేషన్ పేరుతో ఇచ్చిన హామీల అమలును కాంగ్రెస్ మరిచిపోయింది. ఇప్పుడు మళ్లీ కొత్త హామీలు ఇస్తున్నది. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన హామీలు ముందుగా అమలు చేయాలి”అని అన్నారు. బస్తీ పర్యటనలో భాగంగా అంబర్ పేట్ నియోజకవర్గంలో పర్యటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా నిజాం కాలేజ్ గ్రౌండ్స్ ఎదురుగా ఉన్న ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బీజేపీ స్టేట్ ఆఫీసులో జరిగిన వేడుకల్లోనూ పాల్గొని మాట్లాడారు.
జగ్గీవన్ రామ్ ను ప్రధాని కానివ్వని కాంగ్రెస్
దళిత సమాజంలో జన్మించి ఈ దేశానికి అత్యున్నత సేవలందించిన మహానుభావుడుబాబు జగ్జీవన్ రామ్ అని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. ‘‘1977లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నియంతృత్వ విధానాలతో ప్రజాస్వామ్యాన్ని, పత్రికా స్వేచ్ఛను రద్దు చేసి లక్షలాది మందిని జైలులో పెట్టింది. ఆ సమయంలో బాబు జగ్జీవన్ రామ్ కాంగ్రెస్ పార్టీపై తిరుగుబాటు చేసి జనతా పార్టీలో చేరారు. జనతా పార్టీలో చేరిన తర్వాత జయప్రకాశ్ నారాయణ్, మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్, చంద్రశేఖర్, వాజ్ పేయ్, అద్వానీతో కలిసి జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. జనతా పార్టీ ప్రభుత్వంలో డిఫెన్స్ మంత్రిగా, దేశ ఉప ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1980లో జనతా పార్టీ తరఫున జగ్జీవన్ రామ్ ను ప్రధానమంత్రిగా ప్రకటించినప్పుడు.. మేమందరం విద్యార్థులుగా ఉన్నాం. ఆ సమయంలో జగ్జీవన్ రామ్ ప్రధాని కావాలని జనతా పార్టీ గెలుపు కోసం ప్రచారం చేశాం. జగ్జీవన్ రామ్ ను కాంగ్రెస్ పార్టీ ఓడించింది. ఆయన దళితుడు అనే కారణంగా ప్రధాని కాకుండా అడ్డుకున్నది. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం జగ్జీవన్ రామ్ 1977లో చూపించిన ధైర్యం, సాహసం ప్రజలు ఎప్పుడూ మర్చిపోరు. ఎమర్జెన్సీ సమయంలో ప్రజాస్వామ్య శక్తులను ఏకం చేసిన వ్యక్తులలో జగ్జీవన్ రామ్ ముఖ్య పాత్ర పోషించారు.ఆయన జయంతిని బీజేపీ ఆధ్వర్యంలో దేశంలోని అన్ని పట్టణాలు, గ్రామాల్లో ఘనంగా నిర్వహించుకుంటున్నాం. అంబేద్కర్ ను కూడా ఓడించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. దళితనేతలను ఎదగనీయకుండా చేసింది ఆ పార్టీనే. జగ్జీవన్ రామ్ స్ఫూర్తితో నరేంద్రమోదీ నాయకత్వంలో బీజేపీ దేశంలోని బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చిత్తశుద్ధితో పని చేస్తాం”అని పేర్కొన్నారు. అంతకు ముందు అంబర్ పేట నియోజకవర్గంలోని బతుకమ్మ కుంట, ధ్రువ హోటల్ లో అంబర్ పేట్ నియోజకవర్గం ఆర్య వైశ్య సంఘం సభ్యులతో సమావేశామైన కేంద్రమంత్రి వారితో మాట్లాడారు. భరత్ నగర్ కమ్యూనిటీ హాల్ లో మెడికల్ క్యాంపును ప్రారంభించారు.