విదేశాల్లో విద్యపై భారతీయుల అనాసక్తి
భారత్ లోనే విద్య, ఉద్యోగం, వ్యాపారం బెటర్
ఆకర్షించేందుకు కన్సల్టెన్సీలు సిద్ధం
అయినా వెనకడుగు వేస్తున్న విద్యార్థులు
ప్రధాని మోదీ కీలక సంస్కరణలతో భారత్ పైనే ఆసక్తి
నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: కరోనా కష్టకాలం తరువాత గ్లోబల్ వార్మింగ్, ఆర్థిక ఒడిదుడుకులు, ప్రపంచదేశాల్లో యుద్ధ భయాలు, ఆందోళనల నేపథ్యంలో క్రమేణా విదేశీ విద్యపై భారత విద్యార్థులు ఆశలు వదలుకుంటున్నారు. విదేశీ విద్యకంటే భారత్ లోనే విద్యనభ్యసిస్తే ఆర్థిక రూపేణా భారం తప్పుతుందని, తద్వారా కుటుంబాలకు మేలు జరుగుతుందనే ఆలోచనలో ఉన్నారు. అదీగాక ఉద్యోగ సాధనలో కూడా ఒక మెట్టు దిగి భారత్ లోనే అనేక అవకాశాలుండగా వీటిలోనే పరిణితి సాధించి ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటే బెటర్ అనే ఆలోచనలో ఉన్నారు. క్రమేణా విదేశాల్లో విద్య భారీ ఆర్థిక గుదిబండను భారతీయ విద్యార్థులపై మోపుతుండడంతో ఈ రకమైన విద్యపై వెనకడుగు వేస్తున్నారు.
2024లో లక్షమంది వెనకడుగు..
ఆస్ర్టేలియా, అమెరికా, కెనడా, లండన్, సింగపూర్, మలేషియా, యూరప్ తదితర దేశాల్లో భారతీయులు భారీగా విద్యనభ్యసిస్తున్నారు. మారిన పరిస్థితుల కారణంగా 2024 లెక్కల ప్రకారం వీరి సంఖ్యలో భారీ తగ్గుదల నమోదైంది. 2023తో పోలిస్తే 2024లో లక్ష మందికి పైగా విదేశీ విద్యకు వెనుకడుగు వేశారు. విదేశాల్లో విద్యనభ్యసించేవారిలో ఎక్కువగా ఆర్థిక పరిపూర్ణత సాధించిన వారు ఉండకపోవడం, మధ్యతరగతితోపాటు, కాయకష్టం చేసుకునే నిరుపేదలు అతికష్టం మీద ఆర్థిక ఒడిదుడుకులను అధిగమించి వీసాలు, సీట్లు సంపాదించడం, అక్కడికి వెళ్లాక ఏదో ఒక ఉద్యోగం సాధించి తమ కాళ్లపై తాము నిలబడే విధంగా ఉంటూనే విద్యనభ్యసించాలని కోరుకుంటున్నారు. కానీ అక్కడికి వెళ్లాక వారికి భిన్నమైన పరిస్థితులు ఎదురు అవుతుండడంతో విదేశీ విద్యపై క్రమేణా విద్యార్థుల ఆలోచన ధోరణిలో మార్పు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి.
సన్నగిల్లుతున్న నమ్మకం..
ఒకవేళ అక్కడ ఎంఎస్ లాంటి ఉన్నత చదువులు పూర్తి చేసినా విదేశాల్లో, భారత్ లోనే వారి తాహతుకు తగ్గ ఉద్యోగాలు దొరక్కపోవడం కూడా మరొక కారణంగా నిలుస్తుంది. ఓ వైపు కుటుంబం, బంధువులు, చుట్టుపక్కలు, స్నేహితుల్లో విదేశాల్లో చదువుకున్నామని గొప్పలు చెప్పుకోవడమే తప్ప అక్కడ సంపాదించినందంతా అప్పులకే సరిపోతుండడంతో కూడా విదేశీ విద్యపై భారతీయులు వెనుకడుగు వేసేందుకు మరొక కారణంగా నిలుస్తుంది. విద్యార్థుల వెనుకడుగు వేస్తున్న తీరును గమనిస్తున్న ఆయా బడా కన్సల్టెన్సీలు భారీ రాయితీలు, ప్రయోగాలకు సిద్ధమైనా విద్యార్థుల్లో నమ్మకం సన్నగిల్లిపోయింది.
ఆర్థిక పరిపూర్ణత దిశగా దేశ యువత ముందడుగు..
2021, 2022, 2023లో పెరుగుదల నమోదైనా 2024లో భారీ తగ్గుదల చోటు చేసుకుంది. 2025లోనూ ఈ తగ్గుదల మరింత ఉండనుందన్నది ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా విదేశాల్లో మారిన పరిస్థితుల నేపథ్యంలో స్కిల్డ్ ఉద్యోగాలు దొరకడం గగనంగా మారిపోయింది. అదే సమయంలో అన్ స్కిల్డ్ ఉద్యోగాలకూ భారీ పోటీ నెలకొని డిమాండ్ పెరిగింది. దీంతో ఆర్థికంగా పెట్టుకొని వెళ్లే స్తోమత ఉన్న వారు కూడా పునరాలోచనలో పడుతున్నారు. కోటాను కోట్లు వెచ్చించి విదేశాల్లో విద్యనభ్యసించి స్థిరపడడం కన్నా, అదే డబ్బుతో భారత్ లోనే ఏదో ఒక యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించి తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకొని పెట్టుబడులతో ఏదో ఒక రంగంలో తామే వ్యాపారులుగా, యాజమానులుగా ఎదగాలనే ఆలోచనా ధోరణి పెరుగుతోంది.
ప్రధాని మోదీ సంస్కరణలతో సత్తా చాటేందుకు సిద్ధం..
ఈ ధోరణి పెరిగేందుకు ముఖ్యంగా భారత ప్రభుత్వం కూడా ఒక కారణభూతంగా నిలుస్తోంది. దేశీయ ఉత్పత్తి, తయారీ, పరిశ్రమ, విద్యా, వైద్యం, మౌలిక సదుపాయాల కల్పన, రక్షణ తదితర రంగాలను ఓ వైపు బలోపేతం చేస్తూనే యువతకు శిక్షణ ఇస్తూ ఉపాధి కల్పిస్తోంది. మరోవైపు అర్హత సాధించిన వారికి ప్రధాని నరేంద్ర మోదీ పలు సంక్షేమ పథకాల ద్వారా భారీ ఆర్థిక సహాయం అందజేస్తుండడంతో భారతీయ విద్యార్థులు విదేశీ విద్యకు వెనుకడుగు వేస్తుండడం మరో ప్రధాన కారణంగా నిలుస్తోంది. దీంతో రానున్న కాలంలో విదేశీ విద్యపై మక్కువ తగ్గి భారత్ లోనే ఉన్న యూనివర్సిటీలు మరింత బలోపేతం దిశగా ముందుకు సాగే అవకాశం ఉంది. దీంతో విద్యారంగంలోనూ ఇక మోదీ ప్రభుత్వం సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది.