కాంగ్రెస్ ఎంపీపై లైంగికదాడి ఆరోపణ
Allegation of sexual assault on Congress MP
పలు సెక్షన్ల కింద కేసు నమోదు
అందుబాటులోకి రాని రాకేష్ రాథోడ్
లక్నో: యూపీ కాంగ్రెస్ ఎంపీ రాకేష్ రాథోడ్ పై లైంగిక దాడి ఆరోపణలపై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. సీతాపూర్ కొత్వాలినగర్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ రాథోడ్ పై శనివారం ఫిర్యాదు చేసి పలు సాంకేతిక ఆధారాలను కూడా అందజేసింది. తనను ఎంపీ చంపేస్తానని బెదిరిస్తున్నాడని వాపోయింది. బాధితురాలి ఫిర్యాదు, సాంకేతిక ఆధారాల పరిశీలన అనంతరం పోలీసులు రాకేష్ రాథోడ్ పై ఐపీసీ సెక్షన్ 64, బీఎన్ఎస్ 351 (3), 127 (2), బీఎన్ ఎస్ఎస్183, సీఆర్పీసీ 164ల కింద మహిళా వాంగ్మూలాన్ని న్యాయమూర్తి ముందు నమోదు చేసి పలు సెక్షన్ల కింద ఎఫ్ ఐఆర్ నమోదు చేశారు. ఎంపీ తనను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి గత నాలుగేళ్లుగా తనతో కాపురం చేసి ఇప్పుడు ముఖం చాటేశాడని, అదేంటని పెళ్లి చేసుకోవాలని నిలదీస్తే చంపేస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నట్లు బాధితురాలు వాపోయింది. తనవద్ద ఉన్న సాంకేతిక ఆధారాలను, పోలీసులు, న్యాయమూర్తి ముందు పెట్టింది. కోర్టు ఆదేశాలతో నగర కమిషనర్ అనూప్ శుక్లా చట్టపరమైన చర్యలకు సిద్ధమయ్యారు. బాధితురాలికి భద్రత కల్పించారు. ఎంపీని సంప్రదించేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదని పోలీసులు మీడియాకు తెలిపారు.