సీజన్ వ్యాధులపై అప్రమత్తం
ప్రైవేటు ఆసుపత్రులను తనిఖీ చేసిన కలెక్టర్
నా తెలంగాణ, ఆదిలాబాద్: సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా పాలనాధికారి (కలెక్టర్) రాజర్షి షా అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రిని పరిశీలించి రికార్డులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వైద్యాధికారులతో భేటీ అయ్యారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో డెంగ్యూ, రాపిడ్ టెస్ట్, చికిత్స ధరల పట్టికను తప్పనిసరిగా ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. నిబంధనల మేరకు అనుభవజ్ఞులైన వైద్యులతో వైద్య సేవలు అందించాలన్నారు. త్వరలోనే జిల్లాలోని అన్ని ఆసుపత్రుల్లో తనిఖీలు చేపడతానన్నారు. నిబంధనలు పట్టించుకోని గజనాన్ ప్రైవేటు ఆసుపత్రికి నోటీసులు అందజేశారు. రికార్డుల పరిశీలనలో మందుల లభ్యతలో తేడాలను కనుగొని రాజర్షి అసహనం వ్యక్తం చేశారు. కలెక్టరు వెంట జిల్లా వైద్యాధికారి కే.కృష్ణ, నరేందర్, మెడికల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
గురుకుల పాఠశాల తనిఖీ..
కలెక్టర్ మహాత్మా జ్యోతి బా పూలే బీసీ గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. భోజనం, స్టాక్రూమ్, సిక్ రూమ్ తదితరాలను కలెక్టర్ రాజర్షి షా పరిశీలించారు. తిను పదార్థాలపై ఆరా తీశారు. డ్రైనేజీ నిర్మాణానికి పలు సూచనలు, సలహాలిచ్చారు.