ఏఐ సాంకేతికత స్థానిక భాషల్లోనే సుప్రీం తీర్పు
వెబ్ సైట్లలో అందుబాటులోకి సమాచారం పార్లమెంట్ లో మంత్రి అర్జున్ మేఘ్వాల్ వెల్లడి
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: సుప్రీంకోర్టుల తీర్పుల అనువాదానికి ఏఐ సాంకేతికతను అమలు చేస్తోందని కేంద్ర న్యాయ శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ శుక్రవారం పార్లమెంట్ కు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.
ఈ ప్రక్రియ ద్వారా సుప్రీం తీర్పును ఆయా వర్గాలు సులువుగా అర్థం చేసుకునేందుకు వీలు కలుగుతుందన్నారు. ప్రస్తుతానికి అనువాద ప్రక్రియ పర్యవేక్షణ కొనసాగుతోందన్నారు. 2023 నుంచి ఫిబ్రవరి నుంచి రాజ్యాంగ బెంచ్ విషయాలను ఏఐ అనువదిస్తోందన్నారు. ప్రాంతీయ భాషల్లో అనువాద ప్రక్రియ పర్యవేక్షణను సుప్రీం నేతృత్వంలోని న్యాయమూర్తి కమిటీని ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు.
దేశంలోని ఎనిమిది హైకోర్టులో ఇప్పటికే సుప్రీం ఆధ్వర్యంలో ఈ ప్రక్రియను ప్రారంభించాయన్నారు. రాష్ర్ట శాసనాలు, నియమాలు, నిబంధనలను ప్రాంతీయ భాషల్లోకి అనువాదం చేసి సమాచారాన్ని ఆయా వెబ్ సైట్ లలో అందుబాటులో ఉంచాలని సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలను అభ్యర్థించాలని హైకోర్టులను సుప్రీంకోర్టు ఆదేశించిందని తెలిపారు. ఇప్పటికే ఏఐని అనుసరించి 36,271 సుప్రీంకోర్టు తీర్పులు హిందీ భాషలోకి అనువదించబడ్డాయని, 17,142 తీర్పులు, 16 ఇతర ప్రాంతీయ భాషల్లోకి అనువదించబడ్డాయన్నారు. అనువదించిన తీర్పుల కాపీలు స్థానిక భాషా వెబ్ సైట్లు ఈ–ఎస్ సీఆర్ లో అందుబాటులో ఉన్నాయని మంత్రి తెలిపారు.