కొంపముంచిన అవినీతి!
AAP Corruption.. Loss Elections

మద్యం కుంభకోణంతో మసకబారిన ప్రతిష్ఠ
హజారే ఆశయాలు తుంగలోకి
పదవి వ్యామోహంతో ఉచితాలకు తెర
వందల కోట్ల శీష్ మహల్ కూడా ఓటమికి కారణమే
స్వాతిమాలివాల్ పై దాడి.. ఆలోచనలో మహిళా లోకం
కాగ్ రిపోర్టునూ తప్పుపట్టిన కేజ్రీవాల్
నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: ఆప్ అతి విశ్వాసం, అహాంకారం కేజ్రీవాల్ కొంపముంచింది. పదకొండేళ్లుగా ప్రభుత్వాన్ని వెలగబెట్టిన ఢిల్లీ వాసుల కష్టాలు తీరకపోవడమే ఆయన అపజయానికి ప్రధాన కారణం కాగా, మరో ప్రధాన కారణం అన్నా హజారే ఆశయాలను విస్మరించడమేనని చెప్పుకోక తప్పదు. ఓటమి తరువాత అన్నా హజారే మీడియాతో మాట్లాడుతూ.. తొలుత ప్రజా శ్రేయస్సుతో రాజకీయాల్లోకి అడుగిడి సుభిక్ష పాలన అందించిన కేజ్రీవాల్ రాజకీయ యావ, డబ్బు మీద వ్యామోహంతో ముఖ్యంగా మద్యం లాంటి విషయాల్లో కుంభకోణాలే ఆయన ఓటమికి ప్రధాన కారణంగా అభివర్ణించారు. మరోవైపు ఆయన కట్టుకుంటున్న శీష్ మహల్ కూడా ఆయన ఓటమికి మరో ప్రధాన కారణమన్నారు. ఒకవేళ కేజ్రీవాల్ నిజాయితీగా సేవలందిస్తే నేటికీ ఆయనకు తిరుగు లేకుండా ఉండేదన్నారు. కానీ ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా పాలించడం, అవినీతి, అక్రమాలే ఆయన పార్టీ ఓటమికి ప్రధాన కారణాలన్నారు.
ఆప్ పార్టీ రాజ్యసభ సభ్యురాలు, ఎంపీ స్వాతిమాలివాల్ పై దాడి కూడా ఆయన ప్రతిష్ఠను మరింత మసకబార్చేందుకు కారణంగా నిలిచింది. ఏకంగా సీఎం ఇంట్లోనే ఆమెపై దాడి, నిందితున్ని కాపాడేందుకు ప్రయత్నం చేశారు. పైగా దాడిపై ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి పంజాబ్ లో అత్యున్నతస్థాయి పదవి లభించేలా పావులు కదిపారు.
ఇక ఆయన ఓటమికి ముఖ్య కారణంగా మద్యం కుంభకోణమే చెప్పుకోవచ్చు. తెలంగాణ బీఆర్ఎస్ నాయకులతో కలిసి చక్రం తిప్పారు. ఈ కేసులో బీఆర్ఎస్ నాయకురాలు కూడా జైలు పాలైంది. అనంతరం అరవింద్ కేజ్రీవాల్ పదవీచ్యుతుడై జైలు పాలు కావాల్సి వచ్చింది. ఈ కుంభకోణంలో అన్ని సాక్ష్యాలు వీరికి వ్యతిరేకంగా లభించడం కూడా ఆప్ ఓటమికి ప్రధాన కారణంగా మారింది.
తాగునీరు, యమునా నది, కాలుష్యం, విద్య, వైద్యం లాంటి వాటిలో కూడా అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆరోపణల నేపథ్యంలో కాగ్ రిపోర్టు కూడా సమర్పించడంతో మరింత ఆప్ ఇమేజ్ దిగజారింది. కాగ్ రిపోర్టు బీజేపీ పనే అని కూడా ఆరోపణలు చేస్తూ ఉచిత పథకాలతో ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేశారు. అయినా ఢిల్లీ ప్రజలు హజారే ఆశయాలను కాపాడుకోవాలని కంకణం కట్టుకొని కమలానికి అవకాశం ఇచ్చారు.
ఇక ఓటమికి మరో ప్రధానమైన కారణం ఆయన నిర్మించుకుంటున్న శీష్ మహల్. వందలాది కోట్లతో నిర్మించుకొని ఆ ఇంటి నిర్మాణానికి వందలాది కోట్లతో తీర్చిదిద్దడం కూడా ఒక కారణంగా మారింది. అవినీతి, అక్రమాలే చేయలేదన్న ఆయనకు పదేళ్లలో ఇంత సంపద ఎక్కడిదనే బీజేపీ ప్రచారం బాగా పనిచేసింది. ఢిల్లీ ప్రజల్లో మనసుల్లోకి చొచ్చుకువెళ్లింది. దీంతో కేజ్రీకి ఓటమి తప్పలేదు.
అరవింద్ కేజ్రీవాల్ మనీలాండరింగ్, అవినీతి, అక్రమాలు, మద్యం కుంభకోణం కేసులో 2024 మార్చి 21న అరెస్ట్ అయ్యారు. 177 రోజుల తరువాత బెయిల్ పై బయటికి వచ్చారు.
మనీస్ సిసోడియా మనీలాండరింగ్, అవినీతి, అక్రమాల కేసులో 2023 ఫిబ్రవరి 26న అరెస్టు అయ్యారు. 510 రోజుల తరువాత బెయిల్ పై బయటికి వచ్చారు.
సంజయ్ సింగ్ మనీలాండరింగ్ కేసులో 2023 అక్టోబర్ 4న అరెస్ట్ అయ్యారు. 181 రోజుల తరువాత బెయిల్ పై బయటికి వచ్చారు.
సత్యేంద్ర జైన్ మనీలాండరింగ్ కేసులో 2022 మే 30న అరెస్ట్ అయ్యారు. 872 రోజుల తరువాత బెయిల్ లభించింది.
పలువురు నాయకుల అరెస్టులు పార్టీ ప్రతిష్ఠను పూర్తిగా మసకబార్చాయి. జాట్, పూర్వాంచల్, సిక్కు, గుజ్జర్లను బీజేపీకి వ్యతిరేకంగా మార్చే ప్రయత్నం చేశారు. కానీ ఈ ప్రయత్నాన్ని ఋజువులతో సహా తిప్పికొట్టడంతో ఆయన ఈ వర్గాల ఓట్లను గణనీయంగా కోల్పోయారు. ఇవన్నీ కేజ్రీవాల్ ఓటమికి ప్రధాన కారణాలుగా నిలిచాయనే చెప్పాలి.