ఆహార ధరల్లో తగ్గుదల

A fall in food prices

Aug 12, 2024 - 22:04
 0
ఆహార ధరల్లో తగ్గుదల

2024–25 ధరల సూచికల్లో స్పష్టం
తృణధాన్యాల వాడకంలో పెరుగుదల
ఉత్పత్తిలో వృద్ధి
ఆగస్ట్​ లో 5.42 శాతం వద్ద కొనసాగుతున్న ద్రవ్యోల్బణం
సంపాదన, కొనుగోలు శక్తి వల్లే ద్రవ్యోల్బణంపై ప్రభావం
సీపీఐ అంచనాలో 4.5 శాతం వృద్ధి
మార్కెట్​ రిటైల్​ ధరలను సూచిస్తున్న సీపీఐ

నా తెలంగాణ, సెంట్రల్​ డెస్క్​: రిటైల్​ ద్రవ్యోల్బణం 3.54 శాతానికి తగ్గడంతో ఆహార పదార్థాల ధరలు తగ్గాయి. ధరల తగ్గుదల ఆగస్ట్​ 2019లో ప్రస్తుతం ఉన్న కనిష్​ఠ స్థాయికి దిగజారింది. ద్రవ్యోల్బణం తగ్గడం కూడా ప్రజలకు మేలునే చేకూర్చింది. 2024 జూన్​, జూలైకి సంబంధించిన ద్రవ్యోల్బణం, రిటైల్​ ధరల తగ్గుదల, పెరుగుదల నివేదిక  విడుదల చేసింది. ఈ లెక్కల ప్రకారం ద్రవ్యోల్బణం, ఆహార ధరల తగ్గుదలపై కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ తీసుకున్న చర్యలు సత్ఫలితాలను సాధించినట్లుగా స్పష్టం అవుతుంది. 2024–24 ధరల సూచికను పరిశీలిస్తే ఆహార ధరల్లో తగ్గుదలను సూచిస్తుంది. 

ద్రవ్యోల్బణం తగ్గుదల జూలైలో 3.54 శాతానికి ఉన్నా, జూన్​ లో 5.08 శాతంగా ఉంది. కేవలం ఒక్క నెలలోనే ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల భారీగా భారం తగ్గింది. ఆగస్ట్​ 2019లో 3.21 శాతం ద్రవ్యోల్బణం నమోదు కాగా, జూన్​ నెలలో 5.08 శాతంగా నమోదైంది. 

ద్రవ్యోల్బణంలో తేడాలతో ధాన్యాలు, పండ్లు, కూరగాయలు, పప్పులు, సుగంధ ద్రవ్యాల ధరలు తగ్గడం వల్ల ఆహార ద్రవ్యోల్బణం 9.36శాతం నుంచి 5.42శాతానికి తగ్గింది. అదే సమయంలో పట్టణ ద్రవ్యోల్బణం కూడా నెలవారీగా 4.39శాతం నుంచి  నుంచి 2.98శాతానికి తగ్గింది. గ్రామీణ ద్రవ్యోల్బణం 5.66శాతం నుంచి 4.10శాతానికి తగ్గింది.

2023 జూలైలో ఆహార ద్రవ్యోల్బణం భారీగా పెరిగి 11.53 శాతంగా నమోదైంది. ప్రస్తుతం ఆగస్ట్​ లో 5.42 శాతం వద్ద కొనసాగుతోంది. 

తృణధాన్యాలు, పప్పులు భారతీయ వంటకాల్లో, ఆహారాల్లో కీలక భూమిక పోషిస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ తృణధాన్యాలపై ప్రచారం, పంటల పెంపకంపై దృష్టి సారించడంతో ఈ పంటల సాగు భారీగా పెరిగింది. దీంతో గతంలో ఈ పంటల పెంపకంపై అత్యధిక డిమాండ్​ ఉన్నా, పంటల సాగు క్రమేణా పెరుగుతుండడంతో డిమాండ్​ తగ్గి తృణధాన్యాల ధరలు తగ్గుతున్నాయి. 

ఎంపీఎస్​ (మెనిటరింగ్​ పాలసీ కమిటీ) సమావేశంలో ద్రవ్యోల్బణానికి సంబంధించిన అంచనాను 4.5 వద్ద కొనసాగించారు. అదే సమయంలో అప్రమత్తంగా ఉండాలని అనడం గమనార్హం. సంపాదన, కొనుగోలు శక్తి ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపుతుందని ఆర్బీఐ సమావేశంలో గుర్తించారు. కరోనా పరిస్థితుల తరువాత కొనుగోలు శక్తిలో భారతీయుల్లో మార్పు చేర్పులు చోటు చేసుకున్నట్లు గుర్తించారు. అదే సమయంలో డిమాండ్​ ను బట్టి ఉత్పత్తి,సరఫరాలు ఆధారపడి ఉంటాయని తెలిపారు. డిమాండ్​ కు అనుగుణంగా ఉత్పత్తి లేకుంటే ఈ వస్తువుల ధరలు భారీగా తగ్గుతున్నాయని గుర్తించినట్లు తెలిపారు. అధిక కొనుగోలు శక్తి, మార్కెట్లో వస్తువుల కొరతను బట్టి ద్రవ్యోల్బణంలో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. 

ధరలను సీపీఐ (కన్జ్యూమర్​ ప్రైస్​ ఇండెక్స్​) సూచిస్తుంది. రిటైల్​ మార్కెట్​ లో వస్తువుల కొనుగోలు చెల్లింపు ధరలను సీపీఐ నిర్వహిస్తుంది. సీపీఐ సూచించిన ధరలను మాత్రమే పరిగణనలోకి తీసుకొని మార్కెట్లో ధరలు నిర్ణయించి అమ్మకాలు, కొనుగోలు చేపడుతుంటారు. ఇదే సమయంలో ముడి చమురు, కమోడిటీ లాంటి ధరలు కూడా రిటైల్​ ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంటాయి.

2024లో ధరలు తగ్గుదల పెరుగుదలపై సీపీఐ చార్ట్​ విడుదల చేసింది. ఆ చార్ట్​ ప్రకారం

వస్తువులు                   జూన్​                 జూలై
వరి, గోధుమలు           8.75శాతం        8.14 శాతం
చేపలు, కూర              5.39 శాతం       5.97 శాతం
పాలు                          3శాతం             2.99శాతం
నూనెలు            ‌‌         –2.68శాతం       –‌‌1.17 శాతం
పండ్లు                        7.15శాతం        3.84 శాతం
కూరగాయలు             29.32 శాతం     6.83 శాతం
పప్పులు                    16.07 శాతం     14.77 శాతం
మసాలాలు                2.06 శాతం       –1.43 శాతం
కూల్​ డ్రింకులు         2.36 శాతం       2.29 శాతం
పాన్​ మసాలాలు         3.08 శాతం      3.02 శాతం
బట్టలు, పాదరక్షలు    2.73 శాతం      2.67 శాతం
ఫ్యూయల్​                  –3.66శాతం      –5.48 శాతం