న్యూస్‌క్లిక్ కేసు 8వేల పేజీల చార్జీషీటు దాఖలు
న్యూస్ క్లిక్ కేసులో పాటియాలా హౌస్ కోర్టులో రెండు పెట్టెల్లో శనివారం చార్జీషీటు దాఖలు చేశారు. చార్జీషీటు 8వేల పేజీలు ఉందని ఈడీ అధికారులు పేర్కొన్నారు.
న్యూఢిల్లీ: న్యూస్ క్లిక్ కేసులో పాటియాలా హౌస్ కోర్టులో రెండు పెట్టెల్లో శనివారం చార్జీషీటు దాఖలు చేశారు. చార్జీషీటు 8వేల పేజీలు ఉందని ఈడీ అధికారులు పేర్కొన్నారు. భారత్‌కు వ్యతిరేకంగా చైనా ప్రచారం కోసం విదేశీ శక్తులతో చేతులు కలిపి న్యూస్‌క్లిక్ పనిచేసిందనే ఆరోపణలున్నాయి. చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ఇప్పటికే ఢిల్లీ స్పెషల్పోలీసులు, ఈడీ, ఐటీ, సీబీఐ విచారణ చేపట్టారు. కోట్లాది రూపాయల విదేశీ నిధులు అందాయని గుర్తించినట్లు చార్జీషీటులో పేర్కొన్నారు. 2009లో ఈ సంస్థను ప్రారంభించారు. పలుమార్లు వివిధ చోట్ల ఏకకాలంలో సంస్థ కార్యాలయాలపై గతంలో దాడులు నిర్వహించారు. 2020లో న్యూస్‌క్లిక్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అమెరికన్ సంస్థ నుంచి రూ. 9.59 కోట్లు ప్రత్యక్షంగా వచ్చినట్లు గుర్తించారు. రూ. 10 ఉన్న షేరును రూ. 11,510లకు కొనుగోలు చేసినట్లు చూపారు. పోలీసుల సోదాల్లో విదేశీ కరెన్సీ, డాక్యుమెంట్లు, డిజిటల్ఆధారాలను సైతం స్వాధీనం చేసుకొని విశ్లేషించి చార్జీషీట్‌ను దాఖలు చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు. ఈడీ దర్యాప్తులో రూ. 38.05 కోట్ల నిధులు విదేశాల నుంచి వచ్చినట్లు గుర్తించింది. ఎఫ్‌డీఐ ద్వారా రూ. 9.59, సేవల రూపంలో రూ. 28.46 కోట్లు అందినట్లు గుర్తించింది. దేశ చట్టవిరుద్ధ కార్యకలాపాల నిర్వహణపై ఈ సంస్థపై ఉపా చట్టం కింద ఐపీసీ 153ఎ, 120 బీ సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ కేసులో న్యూస్‌క్లిక్ వ్యవస్థాపకుడు పుర్కాయస్తను అరెస్టు చేశారు. 46 మందిని విచారించారు.