ముగ్గురు ఖలిస్థానీ ఉగ్రవాదులు ఎన్ కౌంటర్
Three Khalistani terrorists encounter
పంజాబ్ పోలీస్ స్టేషన్ పై గ్రెనేడ్ దాడి నిందితులు
లక్నో: యూపీలోని పిలిభిత్ లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. సోమవారం ఉదయం జరిగిన ఈ ఎన్ కౌంటర్ లో ముగ్గురు ఖలిస్థానీ ఉగ్రవాదులు హతమయ్యారు. వీరంతా పంజాబ్ లోని గురుదాస్ పూర్ పోలీస్ స్టేషన్ పై దాడికి పాల్పడిన నిందితులని ఎస్పీ అవినాష్ పాండే తెలిపారు. నిందితుల వద్ద నుంచి రెండు ఎకె–47లు, బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ ఎన్ కౌంటర్ లో ఇద్దరు పోలీసులకు కూడా గాయాలయ్యాయన్నారు.
పిలిభిత్, పంజాబ్ పోలీసులు సోమవారం తెల్లవారుజామున ఈ సంయుక్త ఆపరేషన్ చేపట్టారు. అయితే ఖలిస్థానీ జిందాబాద్ ఫోర్స్ కు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు బైక్ పై పారిపోయేందుకు ప్రయత్నిస్తూ ఒక్కసారిగా పోలీసులపై కాల్పులకు తెగబడ్డారు. దీంతో అలెర్టయిన పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో గురుదాస్ పూర్ కు చెందిన గుర్విందర్, వీరేంద్రసింగ్, జస్ ప్రీత్ సింగ్ లు మృతిచెందినట్లు ప్రకటించారు. ఈ ఉగ్రవాదులు డిసెంబర్ 19న పంజాబ్ లోని గురుదాస్ పూర్ పోలీస్ స్టేషన్ పై గ్రెనేడ్లతో దాడికి పాల్పడ్డారు. మృతదేహాలను స్థానికంగా ఉన్న పురా పూర్ సీహెచ్ సీకి పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.