18వ లోక్​ సభ పేర్ల జాబితా రాష్ట్రపతికి అందజేత

ఈసీ ఈసీ, సిబ్బందిని అభినందించిన ముర్మూ

Jun 6, 2024 - 22:13
 0
18వ లోక్​ సభ పేర్ల జాబితా రాష్ట్రపతికి అందజేత

నా తెలంగాణ, న్యూఢిల్లీ: 18వ లోక్‌సభకు ఎన్నికైన సభ్యుల పేర్లను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఈసీ ప్రధాన కమిషనర్​ రాజీవ్​ కుమార్​  సమర్పించారు. దీంతో పాటు లోక్‌సభ ఎన్నికల సందర్భంగా విధించిన ప్రవర్తనా నియమావళి కూడా గురువారంతో ముగిసింది. దేశ ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ గురువారం సాయంత్రం రాజ్​ భవన్​ కు చేరుకొని రాష్ట్రపతికి కొత్త ఎంపీల జాబితాను అందజేశారు.

1951 ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 73 ప్రకారం భారత ఎన్నికల సంఘం జారీ చేసిన నోటిఫికేషన్ కాపీని రాష్ట్రపతికి అందజేసినట్లు రాష్ర్టపతి కార్యాలయం తెలిపింది. 18వ లోక్‌సభకు జరిగిన సాధారణ ఎన్నికల తర్వాత లోక్‌సభకు ఎన్నికైన సభ్యుల పేర్లు ఇందులో ఉన్నాయని పేర్కొంది. 

ఈసీకి రాష్ట్రపతి అభినందన..

మానవ చరిత్రలో అతిపెద్ద ప్రజాస్వామ్య ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినందుకు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్​ కుమార్​ ను, ఆయనకు సహకరించిన అధికారులను రాష్ర్టపతి అభినందించారు. దేశవ్యాప్తంగా ఎన్నికలకు పనిచేసిన ప్రతిఒక్కరిని అధ్యక్షురాలు అభినందించారు. పోలీసులు, ఆర్మీ, అధికారులు, పర్యవేక్షకులు ఎన్నికలు నిర్వహించేందుకు అత్యంత కఠిన శ్రమ చేశారని కొనియాడారు. కోట్లాది మంది ఓటర్లను భాగస్వామ్యులను చేయడంలో సఫలీకృతమయ్యారని అభినందించారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగ విలువలను కాపాడేందుకు ఈసీ చేసిన కృషిని రాష్ర్టపతి ద్రౌపదీ ముర్ము కొనియాడారు. 

17వ లోక్​ సభ బుధవారమే రద్దయిన విషయం తెలిసిందే. రాష్ర్టపతిని కలిసిన వారిలో రాజీవ్​ కుమార్​ తోపాటు జ్ఞానేష్​ కుమార్​, డా. సుఖ్​ బీర్​ సింగ్​ సంధు పాల్గొన్నారు.