రాయ్ పూర్: చత్తీస్ గఢ్ సూక్ష్మాలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. గురువారం అర్థరాత్రి నుంచి శుక్రవారం వరకు జరిగిన ఈ ఎన్ కౌంటర్ లో 10మంది నక్సలైట్లు మృతి చెందారు. ఇంకా ఎన్ కౌంటర్ కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. 2024 జనవరి నుంచి జరిగిన ఎన్ కౌంటర్ లో 207మంది నక్సలైట్లు మృతిచెందారు.
బస్తర్ రేంజ్ ఐజీ సుందర రాజ్ తెలిపిన వివరాల ప్రకారం బెజ్జిలోని దంతేస్ పురం, కొరాజుగూడ, నాగారం అడవుల్లో డీఆర్ఎఫ్, సీఆర్పీఎఫ్ లు కూంబింగ్ నిర్వహిస్తుండగా కిస్టారం ఏరియా కమిటీకి చెందిన కొంటా నక్సలైట్లు తారసపడ్డారు. ఒక్కసారిగా భద్రతాదళాలపై కాల్పులకు దిగారు. దీంతో భద్రతా బలగాలు ఎదురుకాల్పులకు దిగాయి. ఇందులో పదిమంది నక్సలైట్లు మృతిచెందగా ఒక జవాన్ కు కూడా గాయాలయ్యాయి. ఈ నక్సలైట్లు ఒడిశా మీదుగా చత్తీస్ గఢ్ లోకి ప్రవేశించారని ఐజీ తెలిపారు. ఈ ఆపరేషన్ లో 200మంది భద్రతా సిబ్బంది పాల్గొన్నట్లు తెలిపారు. అమద్ అడవుల్లో ఈ కాల్పులు జరిగాయన్నారు. నక్సలైట్ల వద్ద భారీ ఆటోమెటిక్ ఆయుధాలు, షాట్ రైఫిల్స్, నక్సలైట్ సాహిత్యానికి చెందిన పుస్తకాలు, బట్టలు, ఆహార పదార్థాలు లభించాయన్నారు.
2024 జనవరి నుంచి ఎన్ కౌంటర్ల వివరాలు..
– జనవరి–ఏప్రిల్ మధ్య చత్తీస్ గఢ్ – తెలంగాణ బార్డర్ లో మూడు పెద్ద ఎన్ కౌంటర్లు జరిగాయి. ఇందులో 42 మంది నక్సలైట్లు మృతిచెందారు.
– ఏప్రిల్ 2న బీజాపూర్ కర్చౌలీలో 13 మంది నక్సలైట్లు మృతిచెందారు.
– ఏప్రిల్ 5న దంతేవాడలో ఒకరు.
– ఏప్రిల్ 15 కాంకేర్ లో 29 మంది
– 29 ఏప్రిల్ నారాయణ్ పూర్ లో 10 మంది
– మే 10 బీజాపూర్ లో 12 మంది
– మే 23 అబూజ్ మడ్ రెకావాయాలో 8 మంది
– జూన్ 15 అబూజ్ మడ్ ఆమ్దాయ్ లో 8
– జూలై 17 చత్తీస్ గఢ్–మహారాష్ర్ట సరిహద్దులో 12 మంది
– జూలై 18న దంతేవాడలో ఒక మహిళా నక్సలైట్ మృతిచెందింది.
– జూలై 20 సూక్ష్మా జాగర్ గుండా ఒకరు
– ఆగస్ట్ 29 నారాయణ్ పూర్ –కాంకేర్ బార్డర్ లో ముగ్గురు మహిళా నక్సలైట్లు
వీరు గాక మరో 31మంది రివార్డులు ఉన్న నక్సల్స్ కూడా ఎన్ కౌంటర్ లో మృతి చెందారు. ప్రస్తుతం వివిధ రకాల నక్సల్స్ యూనిట్ లో క్రియాశీలకంగా ఉన్నవారి సంఖ్య గణనీయంగా తగ్గింది.
– బెటాలియన్ అనే యూనిట్ లో గతంలో 300 నుంచి 400మంది నక్సలైట్లు ఉండేవారు. వారి సంఖ్య ప్రస్తుతం 180కి తగ్గింది.
– కంపెనీ అనే యూనిట్ లో వందమంది నక్సలైట్లు ఉండగా, ప్రస్తుతం 20 నుంచి 30 మంది మాత్రమే ఉన్నారు.
– ప్లాటూన్ 40 మంది ఉండా ప్రస్తుతం 10 మంది మాత్రమే ఉన్నట్లు ఇంటలిజెన్స్ వర్గాలు గుర్తించాయి.
పెద్ద ఆపరేషన్..
ఈ యేడాదిలో అత్యంత కఠినమైన ఆపరేషన్ ను భద్రతా దళాలు 2గంటల 31 నిమిషాలలో పూర్తి చేశాయి. ఈ ఆపరేషన్ లో 31మంది నక్సలైట్లను ఎన్ కౌంటర్ చేశారు. పెద్ద యెత్తున దంతేవాడ–నారాయణ్ పూర్ సరిహద్దులో నక్సల్స్ వారోత్సవాలు నిర్వహించుకునేందుకు వచ్చారన్న సమాచారంతో ఆపరేషన్ మొదలుపెట్టినా, సమాచారం సరైందా? కాదా? అన్నది మూడు రోజుల ముందుగానే నిర్ధరించుకున్నారు. అనంతరం సుధీర్ఘ నడకను కొనసాగిస్తూ ఏకంగా వెయ్యి మంది భద్రతా సిబ్బంది కొండా, కోనలు, నదులు, అడవులు దాటుకుంటూ చడి చప్పుడు కాకుండా ఆపరేషన్ ను పూర్తి చేశారు. చనిపోయిన 16 మంది నక్సలైట్లపై రూ. 1.30 కోట్ల రివార్డులు ఉన్నాయి.