అసోం ఆప్ అభ్యర్థుల ప్రకటన ఇండి కూటమి, కాంగ్రెస్ కు షాక్
అన్ని స్థానాల్లో సత్తా చాటేందుకు బీజేపీ రెఢీ
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: అసోం ఎంపీ ఎన్నికల్లో ఆప్ తరఫున ముగ్గురు అభ్యర్థులను ఆ పార్టీ గురువారం ప్రకటించింది. దీంతో కూటమిలోని ప్రధాన పార్టీ కాంగ్రెస్ కు భారీ షాక్ తగిలింది. సీట్ల పంపకాలపై జాప్యంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. దిబ్రూగఢ్ నుంచి మనోజ్ ధనోవర్, గుహవాటి నుంచి భాబెన్ చౌదరి, తేజ్ పూర్ నుంచి రిషి రాజ్ కౌటిన్యలను బరిలోకి దింపుతున్నట్లు ఆప్ పార్టీ నేషనల్ జనరల్ సెక్రెటరీ సందీప్ పాఠక్ ప్రకటించారు. ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా నిర్ణయం తీసుకున్నామన్నారు. కూటమిలో భాగస్వాములం అయినప్పటికీ ఈ సీట్లలో తాము పోటీ చేస్తున్నట్లు ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నట్లు కుండబద్ధలు కొట్టింది. సీట్ల పంపకాలపై ఇంకా చర్చలు అనవసరమన్నారు. వేగంగా స్పందిస్తేనే సత్ఫలితాలు సాధిస్తామని పాఠక్ అభిప్రాయం వ్యక్తం చేశారు. కూటమిలోని మిగతా పార్టీల్లో ఏకాభిప్రాయమే కత్తిమీద సాములా మారిందన్నారు. ఈ నేపథ్యంలో తాము పోటీ చేయనున్న స్థానాలను సుస్థిరం చేసుకునే దిశలో చర్యలు తీసుకున్నామని పాఠక్ స్పష్టం చేశారు. అసోంలో మొత్తం 14 ఎంపీ స్తానాలున్నాయి. 2019లో బీజేపీ 9 స్థానాలు, కాంగ్రెస్ 3, ఏఐయూడీఎఫ్ 1, స్వతంత్ర అభ్యర్థి 1 స్థానాలను కైవసం చేసుకున్నారు.
గతంలో బీజేపీ హావా.. ప్రస్తుతం ఆ పార్టీకే ఎక్కువ స్థానాలు..
బీజేపీ నుంచి హోరెన్ సింగ్ బే, దిబ్రూగఢ్ నుంచి రామేశ్వర్ తేలీ, గుహవాటి నుంచి క్వీన్ ఓజా, జోర్హాత్ నుంచి తోపాన్ కుమార్ గొగోయ్, కరీంగంజ్ నుంచి క్రిపానాథ్ మల్లా, లకీంపూర్ నుంచి ప్రధాన్ బూర్హా, మంగళడోయి నుంచి దిలీప్ సైకా, సిల్చార్ నుంచి రాజ్ దీప్ రాయ్, తేజ్ పూర్ నుంచి పల్లబ్ లోచన్ దాస్ లు విజేతలుగా నిలిచారు.
కాగా ఆప్ ప్రకటించిన మూడు స్థానాల్లోనూ బీజేపీ అభ్యర్థులు ప్రస్తుతం మరింత బలాన్ని సాధించుకున్నారు. అసోంలోనూ బీజేపీ ప్రస్తుతం 14 స్థానాలను కైవసం చేసుకునే దిశలోనే ముందుకు సాగుతుండడం గమనార్హం.