యూసీసీ బిల్లు ప్రవేశపెట్టిన సీఎం ధామి
ప్రతిష్టాత్మకమైన యూసీసీ–2024 (యూనిఫాం సివిల్ కోడ్) బిల్లును ఉత్తరాఖండ్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి మంగళవారం ప్రవేశపెట్టారు.
డెహ్రాడూన్: ప్రతిష్టాత్మకమైన యూసీసీ–2024 (యూనిఫాం సివిల్ కోడ్) బిల్లును ఉత్తరాఖండ్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి మంగళవారం ప్రవేశపెట్టారు. బిల్లు ప్రవేశపెడుతున్నప్పుడు ఎమ్మెల్యేలు వందేమాతరం, జై శ్రీరామ్ నినాదాలతో హోరెత్తించారు. కాగా బిల్లుపై పలు అనుమానాలను వ్యక్తం చేస్తూ విపక్షాలు చర్చకు పట్టుబట్టాయి. ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉందని చెప్పినా ఎంతసేపటికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో చేసేదేమీ లేక అసెంబ్లీని వాయిదా వేశారు.ఈ బిల్లుపై సీఎం ధామి మాట్లాడుతూ.. రాష్ర్ట అభివృద్ధి, నిరుపేదల సంక్షేమం, అదే సమయంలో ప్రతీ ఒక్కరికి సమాన హక్కులు కల్పించాలన్నదే తమ ప్రధాన ఉద్దేశ్యమని పేర్కొన్నారు.
వివరాలు..
2022 మే యూసీసీపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జీ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. 2022, మే 27న నోటిఫికేషన్ జారీ చేసింది. నిబంధనలను 2022 10 జూన్ నోటిఫై చేసింది. జూలై ఢిల్లీలో కమిటీ మొదటి సమావేశాన్ని నిర్వహించింది. ప్రజలు, నిపుణులు రాష్ర్టంలోని క్షేత్రస్థాయిలో సందర్శించి పలువురి అభిప్రాయాలను తీసుకొని బిల్లు రూపకల్పన ముసాయిదాను సిద్ధం చేసింది. ఇందుకు గాను కమిటీకి 13 నెలల సమయం పట్టింది. ఆన్ లైన్, ఆఫ్ లైన్ ద్వారా కమిటీ 20 లక్షల సూచనలను స్వీకరించింది. నేరుగా 2.5 లక్షల మందిని కలిసి అభిప్రాయాలను సేకరించింది. 2023 జూలై బిల్లులో మార్పు చేర్పుల అనంతరం తుదిరూపునిచ్చింది. 2024 ఫిబ్రవరి బిల్లును ప్రభుత్వానికి అందజేసింది. గోవా తరువాత యూసీసీ అమలు చేస్తున్న రెండో రాష్ర్టంగా ఉత్తరాఖండ్ నిలిచింది.