లోక్‌స‌భ ఎన్నిక‌ల లోపే సీఏఏ అమలు

1947లో దేశ విభజనకు కారణమైన కాంగ్రెస్​ కు యాత్ర చేసే అర్హత లేదు

Feb 10, 2024 - 16:18
 0
లోక్‌స‌భ ఎన్నిక‌ల లోపే సీఏఏ అమలు

న్యూఢిల్లీ: పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టాన్ని లోక్‌స‌భ ఎన్నిక‌ల లోపే అమ‌లు చేస్తామ‌ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. ఢిల్లీలో జ‌రిగిన గ్లోబల్​ బిజినెస్ స‌మ్మిట్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న త‌మ ప్రభుత్వం గురించి వివ‌ర‌ణ ఇస్తూ.. 2019లో త‌యారు చేసిన సీఏఏ చ‌ట్టాన్ని రాబోయే లోక్‌స‌భ ఎన్నిక‌ల లోపే దేశ‌వ్యాప్తంగా అమ‌లు చేయ‌నున్నట్లు చెప్పారు. సీఏఏ గురించి ముస్లిం సోద‌రుల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించార‌ని, వాళ్లను రెచ్చగొట్టార‌ని, వేధింపులు త‌ట్టుకోలేక జీవ‌నోపాధి కోసం పాక్‌, అఫ్గాన్​, బంగ్లా నుంచి భార‌త్‌కు వ‌చ్చిన వారికి పౌర‌సత్వాన్ని ఇవ్వనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఎవ‌రి భార‌తీయ పౌర‌స‌త్వాన్ని లాక్కోవ‌డం ఆ చ‌ట్టం ఉద్దేశం కాద‌న్నారు.

రాజ్యాంగ లక్ష్యం..

ఉమ్మడి పౌర స్మృతి అమ‌లు రాజ్యాంగ ల‌క్ష్యమని అమిత్​ షా తెలిపారు. దేశ తొలి ప్రధాని నెహ్రూ ఆ పౌర స్మృతి బిల్లు గురించి చ‌ర్చించార‌న్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి పౌర స్మృతిని విస్మరించింద‌న్నారు. ఉత్తరాఖండ్‌లో యూసీసీ అమ‌లు చేయ‌డం సామాజిక మార్పుగా అభివర్ణించారు. సెక్యుల‌ర్ దేశంలో మ‌త‌ప‌ర‌మైన పౌర‌స్మృతులు ఉండ‌వ‌న్నారు. ‘‘మేము ఆర్టికల్‌ 370ని రద్దు చేశాం. అందుకే దేశ ప్రజలు బీజేపీకి 370 సీట్లు.. మొత్తంగా ఎన్డీయేకు 400 సీట్లు ఇచ్చి ఆశీర్వదిస్తారని నేను నమ్ముతున్నాను’’ అని అమిత్‌ షా వ్యాఖ్యానించారు. మోదీ నాయ‌క‌త్వంలో త‌మ ప్రభుత్వం మూడో సారి ఏర్పడబోతున్నదని వెల్లడించారు.

కాంగ్రెస్​ కు ఆ అర్హత లేదు..

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో జరుగుతున్న భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర గురించి కూడా అమిత్‌ షా స్పందించారు. 1947లో దేశ విభజనకు కారణమైన ఆ పార్టీ నేతకు ఈ తరహా యాత్రతో ముందుకు వెళ్లే అర్హత లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన శ్వేతపత్రం గురించి మాట్లాడుతూ.. ‘2014లో భారత ఆర్థిక వ్యవస్థ ఒడుదొడుకుల్లో ఉంది. అంతటా కుంభకోణాలే. విదేశీ పెట్టుబడులు రావడం లేదు. అప్పుడే శ్వేతపత్రం తెచ్చి ఉంటే.. ప్రపంచానికి తప్పుడు సందేశం వెళ్లేది. ఈ పదేళ్లలో ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టాం. అవినీతి లేదు. విదేశీ పెట్టుబడులు భారీగా వచ్చాయి. అందుకే ఈ పత్రాన్ని తీసుకురావడానికి ఇదే సరైన తరుణం’ అని తెలిపారు. రాముడు జన్మించిన ప్రాంతంలో రామమందిరాన్ని నిర్మిస్తారని దేశ ప్రజలు 500 ఏళ్లపాటు నమ్మారని, బుజ్జగింపు రాజకీయాల కారణంగా ఆ కల ఆలస్యమైందన్నారు.