రాష్ట్ర అప్పు ఎంత? హామీలు ఎట్ల అమలు చేస్తరు?
ఆరు గ్యారంటీలు సరే.. మిగతా హామీలకు ఎవరు గ్యారంటీ?
నా తెలంగాణ, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి విషయంలో ప్రజలకు స్పష్టత ఇవ్వడం లేదని బీజేపీ ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. రాష్ట్ర సర్కారు అప్పు ఎంత? ఇచ్చిన హామీలు ఎలా అమలు చేస్తారనే దానిపై ప్రభుత్వం జవాబు చెప్పాలని ఆయన కోరారు. ఈ మేరకు శుక్రవారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో భాగంగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితిని ఎట్లా గాడిలో పెడ్తుందో చెప్పాలని అన్నారు. ‘‘మంత్రులు, ప్రభుత్వ పెద్దలు రోజూ ఆరు గ్యారంటీల గురించే మాట్లాడుతున్నారు. మరి మిగతా హామీలకు ఎవరు గ్యారంటీ? కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంలో ఏకకాలంలో రూ.2 లక్షల రైతు రుణమాఫీ హామీ కీలకమైనది. కానీ ఎప్పటిలోపు రుణమాఫీ చేస్తారో ప్రభుత్వం చెప్పడం లేదు. గవర్నర్ ప్రసంగంలో ఈ విషయం ఉంటే బాగుండేది. కేంద్ర ప్రభుత్వం రైతులకు ఎంతో మేలు చేయాలనే ఉద్దేశంతో ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకం తెచ్చింది. గత సర్కారు ఈ పథకానికి ప్రీమియం కట్టక ఆపేసింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమైనా దీనిపై నిర్ణయం తీసుకోవాలి. రైతు బీమా ఇవ్వడంలో అభ్యంతరం లేదు. కానీ రైతు చనిపోవడానికి కారణమైన పంట నష్టానికి కూడా బీమా ఉండాలని బీజేపీ డిమాండ్ చేస్తున్నది”అని ఆయన స్పష్టం చేశారు.
రెండు పార్టీలను ఓడించిన చరిత్ర బీజేపీది
గత సర్కారు హయాంలో రాష్ట్రంలో మద్యం ఏరులై పారిందని, ప్రతి గ్రామంలో పది నుంచి పదిహేను బెల్ట్ షాపులు సర్కారే నడిపించిందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే బెల్టు షాపులు మూసివేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్.. ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు దాటినా.. ఇంకా బెల్టు షాపులను మూసివేయలేదని అన్నారు. ఎప్పుడు మూసివేస్తారో చెప్పాలని సభలో ప్రశ్నించారు. ‘‘రాష్ట్రానికి వేల కోట్ల పెట్టుబడులు తీసుకు వచ్చినట్లు ప్రభుత్వ పెద్దలు చెప్పారు. అయితే పెట్టుబడులు ఎంత సేపు హైదరాబాద్ కు మాత్రమేనా? వెనుకబడిన ఆదిలాబాద్, ఆసిఫాబాద్ లాంటి జిల్లాలకు పెట్టుబడులు, పరిశ్రమలు రావొద్దా? ప్రభుత్వం ఈ విషయంలో ఆలోచన చేయాలి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వివిధ ప్రాజెక్టుల ప్రారంభోత్సవం కోసం తెలంగాణకు వస్తే.. గత ప్రభుత్వంలో మాజీ సీఎం కేసీఆర్ స్వాగతం తెలపలేదు. కనీస ప్రొటోకాల్ పాటించలేదు. కేంద్రంతో సఖ్యతగా మెలగక అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో రాష్ట్రానికి రావాల్సిన నిధులను పట్టించుకోక అన్యాయం చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రాజకీయాలకు, పంతాలకు పోయి తెలంగాణకు అన్యాయం చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటేనని కాంగ్రెస్ అంటున్నది.. కాంగ్రెస్, బీజేపీ ఒకటేనని బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. కానీ బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలను ఓడించిన చరిత్ర బీజేపీది. మా పార్టీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోదు. చట్టసభలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని చెప్తున్నాను”అని పాయల్ శంకర్ తెలిపారు.