దేవాలయాలు ప్రార్థనా స్థలాలు కాదు.. హిందూ సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబించే చిహ్నాలు

గుజరాత్​ వలీనాథ్​ మహాదేవ్​ ఆలయంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు

Feb 22, 2024 - 15:11
 0
దేవాలయాలు ప్రార్థనా స్థలాలు కాదు.. హిందూ సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబించే చిహ్నాలు
గాంధీనగర్​: దేవాలయాలు కేవలం ప్రార్థనా స్థలాలు మాత్రమే కాదని, హిందూ సంస్కృతిని, సాంప్రదాయాన్ని ప్రతిబింబించే లక్షల సంవత్సరాల చిహ్నాలని, మనదేశంలోని దేవాలయాలపై ఉన్న శిల్పకళా నైపుణ్యం ద్వారా మానవాళి అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు వెళ్లే విధంగా ఉండడం మన అదృష్టమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గుజరాత్​ లో పర్యటించారు. గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో పాల్గొన్న ఆయన అహ్మదాబాద్ చేరుకున్నారు. మెహ్సానా చేరుకుని వలీనాథ్ మహాదేవ్ ఆలయంలో పూజలు చేశారు. ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం ప్రధాని మోదీ ప్రసంగించారు. 
 
దైవ కార్యాల్లో పాల్గొనడం తన పూర్వ జన్మ సుకృతమన్న ప్రధాని..
సరిగ్గా నెల క్రితం అయోధ్యలో రాముడి పాద సేవ చేసుకున్నానని గుర్తుకు తెచ్చుకున్నారు. అక్కడ బాలరామ విగ్రహ ప్రాణప్రతిష్ట, అబూదాబిలో హిందూ దేవాలయ ప్రారంభం, ఉత్తరప్రదేశ్​ లో కల్కిధామ్​ శంకుస్థాపన లాంటి దైవ్య కార్యాల్లో తనకు అవకాశం లభించడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు ప్రధాని మోదీ పేర్కొన్నారు. నేడు వలీనాథ్​ మహాదేవ్​ ఆలయంలో ప్రతిష్ఠాపన మహోత్సవాల్లో పాల్గొనడం అత్యంత సంతోషకరమన్నారు. తన జీవితం ధన్యమైందన్నారు.
 
దేశ, దైవ సేవ తన అదృష్టం మోదీ
ఓవైపు భగవంతునికి, మరోవైపు దేశానికి సేవ చేసే అత్యంత అరుదైన అవకాశం అతి కొద్దిమందికే లభిస్తుందని, ఆ అవకాశాన్ని భగవంతుడు తనకు కల్పించడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు ప్రధాని తెలిపారు. ఈ పవిత్రమైన కార్యాన్ని అంత్యత పవిత్రంగా భావిస్తూ మనసా వాచ తూ.చ. తప్పకుండా తన శక్తివంచన లేకుండా పనిచేస్తానని ప్రధానమంత్రి తెలిపారు. దైవ, దేశ సేవ చేయడం ఎంతో సంతోషాన్నిస్తుందన్నారు.
 
కార్మికులు, కర్షకులు, కళాకారుల ప్రతిభకు నిదర్శనం పురాతన ఆలయాలు..
ఆలయాల్లో శిల్పకళా సౌందర్యాన్ని రూపొందించేందుకు ఏళ్ల తరబడి కార్మికులు, కర్షకులు, కళాకారులు చేసిన అవిశ్రాంత శ్రమ ఫలితమే మనం నేడు చూస్తున్న పురాతన ఆలయాలన్నారు. ఈ ఆలయాల్లో భగవంతుని దర్శించుకుంటే మనస్సు పులకరించిపోతోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పునరుద్ఘాటించారు.
 
గుజరాత్​ లో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ప్రధాని మోదీ చేసేందుకు మూడు రోజుల గుజరాత్​ పర్యటన చేపట్టారు.