జీరో బిల్లు వాపస్​!

– 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం రివర్స్​ –  ఫిబ్రవరి నుంచి బకాయి బిల్లు మొత్తం ఏప్రిల్​ బిల్లులో జమ – ఉచితం ఆశ చూపి రెండు నెలల బిల్లు ఒకేసారి వసూలు  – ఎన్నికల కోడ్ వల్ల పథకం అమలు చేయట్లేదంటున్న ఆఫీసర్లు – కరెంట్​ బిల్లు చూసి ఖంగుతింటున్న వినియోగదారులు

Apr 10, 2024 - 17:32
 0
జీరో బిల్లు వాపస్​!

నా తెలంగాణ, హైదరాబాద్​: ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీ మేరకు నివాస గృహాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అందించేందుకు కాంగ్రెస్‌ సర్కారు ప్రారంభించిన గృహజ్యోతి పథకం నెల రోజులకే రివర్స్​ అయింది. ఫిబ్రవరి 27న ప్రారంభమైన ఈ పథకం వినియోగదారులను ఒక నెల జీరో బిల్లుతో మురిపించింది. గత రెండు నెలల బిల్లు ఏప్రిల్​ నెలలో జమ చేస్తూ.. మొత్తం వసూలు చేస్తున్నది. ఏప్రిల్​ బిల్లులో గత జీరో బిల్లు బకాయిలు కూడా జమ కావడం చూస్తున్న వినియోగదారులు ఇదేమిటని ప్రశ్నిస్తున్నారు.

సోషల్​ మీడియాలో ఫొటోలు..

చంపాపేట్​ ఈఆర్​వో పరిధిలోని అలమాస్​ గూడ జయశంకర్​ కాలనీలో ఓ మహిళకు గత నెలలో 262 రూపాయల కరెంట్​ బిల్లు వస్తే.. గృహజ్యోతి పథకంలో భాగంగా అధికారులు ఆమెకు జీరో బిల్లు జారీ చేశారు. కానీ ఏప్రిల్​ 4న వచ్చిన కరెంట్​ బిల్లులో గత నెల రూ. 262 + ఈ నెల రూ. 547 మొత్తం కలిపి రూ.809 చెల్లించాలని పేర్కొంది. దీనికి సంబంధించిన రెండు బిల్లులో ప్రస్తుతం సోషల్​ మీడియాలో వైరల్​ గా మారాయి. ఇదేమిటని బిల్లు జారీ చేస్తున్న వారిని అడిగితే.. ఎన్నికల కోడ్ ఉండటం వల్ల పథకం అమలు చేయట్లేదని చెబుతున్నారు. ఎన్నికల ముందు ప్రారంభమైన ఈ పథకం కోడ్​ వస్తే.. ఎందుకు నిలుస్తుందని వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు.