ఎఐ, పరిశోధనల్లో ప్రపంచానికి నాయకత్వం
వెబ్ నార్ లో ప్రధాని నరేంద్ర మోదీ

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: కృత్రిమ మేథస్సు (ఎఐ), పరిశోధన రంగాలలో భారత్ ప్రపంచంలో నాయకత్వానికి సిద్ధంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బుధవారం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఉపాధిపై బడ్జెట్ అనంతర వెబ్‌నార్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారతదేశ ఆర్థిక, సాంకేతిక వృద్ధికి సమగ్ర దార్శనికతను వివరించారు. దేశ పురోగతిలో ఏఐ కీలక పాత్ర పోషించనుందన్నారు. ఏఐ ఆధారిత విద్య, పరిశోధన కోసం బడ్జెట్ లో రూ. 500 కోట్లు కేటాయించామని, నేషనల్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్‌ను కూడా ప్రారంభించామని చెప్పారు. సురక్షితమైన, ప్రజాస్వామ్య బద్ధమైన, విశ్వసనీయమై ఎఐ వ్యవస్థను ప్రపంచం వెతుకుతుందన్నారు. ఈ రంగానికి నాయకత్వం వహించేందుకు భారత్ సన్నద్ధంగా ఉండాలన్నారు. ఎఐ ఆధారిత సమస్యల పరిష్కారాలలో ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలన్నారు. స్టార్టప్ వ్యవస్థలో మూడో అతిపెద్ద వ్యవస్థగా భారత్ ఉందన్నారు. డీప్ టెక్ ఆవిష్కరణ, పరిశోధనల కోసం రూ. 1 లక్ష కోట్ల కార్పస్ నిధిని ప్రధాని ప్రకటించారు. ఈ నిధుల ద్వారా దేశ చారిత్రక, శాస్ర్తీయ వారసత్వాన్ని కాపాడటం, ప్రధానమంత్రి జ్ఞాన్ భారత్ మిషన్ ను ప్రారంభించడం, పురాతన రాతపత్రులను డిజిటలైజ్ చేసేందుకు వినియోగించనున్నారు. వ్యవసాయ స్థిరత్వం, మొక్కల జన్యు వనరులను సంరక్షించడానికి, దీర్ఘకాలిక ఆహార భద్రత మరియు వాతావరణ స్థితిస్థాపకతను నిర్ధారించడానికి జాతీయ జన్యు బ్యాంకును ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆర్థిక రంగంలో 2015 నుంచి 2025 మధ్య పరిస్థితులను వివరించారు. ఐఎంఎఫ్ నివేదికను ప్రధాని నరేంద్ర మోదీ ఉదహరించారు.