మూడు రోజుల్లోనే క్లైయిమ్ లకు పరిష్కారం
ప్రధాని మోదీ, మంత్రి మాండవీయాలకు కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి కృతజ్ఞతలు

బేగంపేటలో నూతన ఈపీఎఫ్ వో జోనల్ కార్యాలయం ప్రారంభం
దేశంలోనే నెం.1 ఈఎస్ఐ ఆసుపత్రి నగరంలోనే
మరిన్ని ఆసుపత్రులకు స్థలాలను కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి
ఈ–కామర్స్ కార్మికులకు ప్రయోజనాలను వర్తింపచేయాలని వినతి
నా తెలంగాణ, హైదరాబాద్: దేశంలోని కార్మికుల క్లైయిమ్ లను కేవలం మూడు రోజుల్లోనే పరిష్కారం చూపే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టమైన ఆదేశాలిచ్చారని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. గురువారం కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయా ఈపీఎఫ్ వో నూతన జోనల్ కార్యాలయాన్ని బేగంపేటలో ప్రారంభించిన కార్యక్రమంలో కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రధాని మోదీ, మంత్రి మాండవీయాకు ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కార్మికుల సంక్షేమం కోసం అనేక నూతన విధానాలతో ముందుకు వెళుతుందన్నారు. దేశంలోనే సనత్ నగర్ ఈఎస్ ఐ కార్మిక ఆసుపత్రి నెం.1గా నిలిచిందని ఇందుకు మంత్రి మన్సుఖ్ మాండవీయాకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే కార్మికులకు అస్యూర్డ్ బెనిఫిట్స్ రూ. 50 వేలు నిర్ణయించడం హర్షణీయమన్నారు. తెలంగాణ ప్రాంతంలో మరిన్ని ఆసుపత్రులు, ఈపీఎఫ్ వోలు నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం ఇప్పటికే తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. రామగుండం లాంటి చోట్ల స్థలాలు కేటాయిస్తే పనులను మొదలు పెడతామన్నారు. హైదరాబాద్ మహానగరంలో ఈ–కామర్స్ (అసంఘటిత రంగం)లో పనిచేసే లక్షలాది కార్మికులకు కూడా ఈపీఎఫ్ వో ఫలాలను అందించాలని ప్రధాని నరేంద్ర మోదీకి వివరిస్తానని, అందుకు కేంద్రమంత్రి మాండవీయాకు కూడా ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కామర్స్ రంగం ప్రస్తుతం దేశంలో దినదినం ప్రవర్థమానంగా ఎదుగుతుందన్నారు. ఆ రంగంలో ఉన్న కార్మికుల క్షేమాన్ని కూడా కోరుతున్నట్లు చెప్పారు. ఈపీఎఫ్ వో నూతన కార్యాలయాన్ని ప్రారంభిస్తూ సేవలను మరింత విస్తృతం చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ మరోసారి ప్రధాని మోదీ, మంత్రి మాండవీయాలకు కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.