రాహుల్ గాంధీకి రూ. 200 జరిమానా!
Rahul Gandhi Rs. 200 fine!

సావర్కర్ పై అనుచిత వ్యాఖల కేసు
ఏప్రిల్ 14న హాజరుకాకుంటే కఠిన చర్యలు తప్పవు
లక్నో: వీర్ సావర్కర్ పై అనుచిత వ్యాఖ్యలపై లక్నో కోర్టు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి రూ. 200 జరిమానా విధించింది. బుధవారం కేసు విచారణ సందర్భంగా అదనపు చీఫ్ జ్యూడీషియల్ మెజిస్ర్టేట్ కోర్టు ఈ జరిమానాను విధించారు. రాహుల్ గాంధీ ఏప్రిల్ 14న కోర్టుకు హాజరు కావాలని ఆదేశించారు. హాజరుకాకుంటే కఠినమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. 2022లో న్యాయవాది నృపేంద్ర పాండే ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీపై క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్పీసీ) సెక్షన్ 156 (3) కింద ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును విచారిస్తున్న సమయంలో, కోర్టు రాహుల్ గాంధీకి సమన్లు జారీ చేసింది. 2022 డిసెంబర్ 17న మహారాష్ట్రలోని అకోలాలో జరిగిన విలేకరుల సమావేశంలో రాహుల్ గాంధీ వీర్ సావర్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని న్యాయవాది నృపేంద్ర పాండే ఫిర్యాదులో ఆరోపించారు. అప్పట్లో పంచిన కరపత్రాలు, సాక్షుల వాంగ్మూలాలు, సాక్ష్యాలను కోర్టు తీవ్రంగా పరిగణించింది. రాహుల్ వ్యాఖ్యలు ద్వేషం పెంచేలా ఉన్నాయని కోర్టు పిటిషన్ ను విచారణకు స్వీకరించింది. కాగా బుధవారం అధికారిక పనుల్లో బిజీగా ఉండటంతో కోర్టుకు హాజరు కాలేకపోయారని ఆయన న్యాయవాది కోర్టులో దరఖాస్తు సమర్పించారు. దీంతో కోర్టుకు గైర్హాజర్ అయినందుకు రూ. 200 జరిమానా చెల్లించాలని, తదుపరి విచారణకు ఏప్రిల్ 14కు వాయిదా వేసింది.