భక్తి నినాదంపై పగా?
జై భజరంగ భళీ అంటే కొడతారా హనుమాన్ చాలీసా వింటే దాడులు చేస్తారా? నేరంగా మార్చింది కాంగ్రెస్, కూటమి పార్టీలే ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు ఇతరులకిస్తారా? రాజ్యాంగాన్ని ఎప్పుడైనా పట్టించుకున్నారా? దేశ ఆస్తులు ఇతరులకు పంచుతారా? ఈఆర్సీపీ ప్రాజెక్టుకు మోకాలడ్డు రాజస్థాన్ టోంక్ లో ప్రధాని మోదీ
జైపూర్: హనుమాన్ చాలీసా వింటే భక్తులపై దాడి చేస్తారా? జై భజరంగ భళీ అంటే రక్తం కారేలా కొడతారా అని ప్రధానమంత్రి మోదీ మండిపడ్డారు. ‘జై భజరంగ భళీ’ యావత్ హిందు సమాజం భక్తినినాదంపై పగలు, ప్రతీకారాలు పెంచుకుంటారా? అని మండిపడ్డారు. మంగళవారం రాజస్థాన్ లోని టోంక్ సవాయి మాధోపూర్ ఎంపీ స్థానంలో ప్రధాని మోదీ ప్రచారం నిర్వహించారు. ప్రధాని తన ప్రసంగాన్ని జై భజరంగ భళీతో ప్రారంభించారు. దేశంలో కాంగ్రెస్ అనుసరిస్తున్న ద్వంద్వ నీతిని ఎండగట్టారు. దేశంలో హనుమాన్ చాలీసా వినడం కూడా నేరంగా మార్చింది కాంగ్రెస్, కూటమి పార్టీలని మండిపడ్డారు.
2011లో ఎస్సీ-ఎస్టీలకు ఇచ్చిన హక్కులను లాక్కొని ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వాలని కాంగ్రెస్ ప్రయత్నించిందని ఆరోపించారు. బాబా సాహెబ్ రాజ్యాంగాన్ని కాంగ్రెస్ ఎప్పుడైనా పట్టించుకున్న దాఖలాలున్నాయా? అని ప్రశ్నించారు. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక మత ప్రాతిపదికన రిజర్వేషన్‌ను రద్దు చేశామని ప్రదాని తెలిపారు. దళితులు, వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు తగ్గించడం ద్వారా ముస్లింలను విభజించబోమని కాంగ్రెస్ ప్రకటిస్తుందా? అని ప్రశ్నించారు. మత ప్రాతిపదికన రిజర్వేషన్లపై తీవ్ర వ్యతిరేకత ఉందని ప్రధాని మోదీ అన్నారు. దేశ ఆస్తులను తీసుకొని ఇతరులకు పంచే కుట్రకు కాంగ్రెస్ తెరలేపిందని ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీతిమాలిన రాజకీయాలకు కాంగ్రెస్ తెరలేపుతోందన్నారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నంత వరకు రామ నవమి, హనుమాన్ చాలీసాలే కాకుండా అన్ని పండుగలను హిందువులు శాంతియుతంగా, భక్తిభావంతో నిర్వహిస్తారని స్పష్టం చేశారు.
రాజస్థాన్ లో ఒక్క సీటును కూడా హస్తానికి దక్కదని అన్నారు. రాజస్థాన్ లో ఈఆర్సీపీప్రాజెక్టును ఆమోదించేందుకు కాంగ్రెస్ మోకాలడ్డిన విషయాన్ని ప్రధాని మోదీ వివరించారు.
ఈఆర్సీపీ పథకం బీజేపీ ప్రభుత్వం వచ్చాక ఆమోదం పొందిందన్నారు. దీనివల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతోందన్నారు. ఒక్క టోంక్ జిల్లాలోనే రైతులకు రూ. 1100 కోట్లను పంపిణీ చేశామన్నారు. టోంక్ లో సంఘ విద్రోహ చర్యలకు పాల్పడే వారిపై, మాఫియాపై సీఎం భజన్ లాల్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఇక్కడి శాంతి సామరస్యాలను కాపాడడమే తమకు ముఖ్యమన్నారు.
దేశంలోని 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. సరిహద్దులను కాపాడేందుకు తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిచ్చిందన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ రాజస్థాన్ ప్రజలను మభ్యపెట్టి విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు.