ఢిల్లీ పీఠం ఎవరికి దక్కేనో?

Who will get the seat of Delhi?

Feb 19, 2025 - 14:26
 0
ఢిల్లీ పీఠం ఎవరికి దక్కేనో?

హస్తినలో బీజేపీ అధిష్టానం వరుస సమావేశాలు
రాత్రి 7 గంటలకు శాసనసభాపక్ష సమావేశంలో తుది నిర్ణయం
రేపు 12 గంటలకు సీఎం ప్రమాణ స్వీకారం
ప్రముఖులకు అందిన ఆహ్వానపత్రాలు

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఢిల్లీ సీఎం పీఠం ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠకు ఇంకా తెరపడడం లేదు. బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంలో పార్లమెంటరీ బోర్డు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎం ఎవరన్నదానిపై చర్చించారు. ప్రవేశ్​, రేఖ, శిఖా, ఆశిష్​, విజయేంద్రలు సీఎం రేసులో తొలివరుసలో ఉండగా ఇప్పటికే నేతలందరూ అధిష్ఠాన నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ప్రకటించిన నేపథ్యంలో అంతిమ నిర్ణయం రాత్రి 7గంటలకు జరిగే బీజేపీ శాసనసభా పక్ష సమావేశం నిర్ణయం తీసుకొని ప్రకటించనున్నారు. కాగా శాసనసభా పక్ష సమావేశం మధ్యాహ్నం 3 గంటలకే జరగాల్సి ఉన్నా, సాయంత్రానికి వాయిదా వేశారు. అయితే ప్రధానమంత్రి మోదీ, కేంద్రమంత్రులు అమిత్​ షా, జేపీ నడ్డా లు సీఎం ఎవరన్నదానిపై తుది నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. 

మరోవైపు ఢిల్లీ రాంలీలా మైదానంలో గురువారం 12 గంటలకు సీఎం పదవి ప్రమాణ స్వీకారం ఏర్పాటు చేశారు. ఏర్పాట్లను బీజేపీ సీనియర్​ నాయకుడు తరుణ్​ చుగ్​ పర్యవేక్షిస్తున్నారు. సీఎం ఆహ్వాన లేఖలను ఇప్పటికే విడుదల చేసి ఆయా రాష్ర్టాల బీజేపీ, ఎన్డీయే పాలక ముఖ్య నాయకులకు ఆహ్వానాలు అందజేశారు. 

కాగా గతంలో కూడా పలురాష్ర్టాల ముఖ్యమంత్రుల పేర్లను పరిశీలిస్తే ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగుచూశాయి. ఊహించని వారికి సీఎం పదవులు దక్కాయి. ఈసారి కూడా అదే దిశలో బీజేపీ సీఎం పదవిని కట్టబెట్టే అవకాశం లేకపోలేదని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. 

ప్రవేశ్​ వర్మ జాట్​ వర్గానికి చెందిన వారు కావడంతో బీజేపీ అయనవైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది. దీంతో యూపీ, హరియాణా, పంజాబ్​ లాంటి రాష్ర్టాల్లో బలమైన ఓటు బ్యాంకును కూడగట్టుకోవాలని భావిస్తుంది. అదే సమయంలో మహిళా సీఎంగా రేఖా గుప్తా  ముందు వరుసలో ఉన్నారు. ఒక్క మహిళనైనా సీఎం సీటుపై కూర్చోబెడితే మహిళలకు బీజేపీ బలమైన సందేశం ఇచ్చినట్లుగా భావిస్తున్నారు. అయితే వీరితోపాటు మరో ఏడుగురు కూడా సీఎం రేసులో ఉండడంతో పదవి ఎవరిని వరిస్తుందో అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది.