బాధ్యతలు చేపట్టిన సీఇసీ జ్ఞానేష్ కుమార్
CEC Gyanesh Kumar took charge

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ గా జ్ఞానేష్ కుమార్ బుధవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఉదయం ఆయన బాధ్యతలు స్వీకరిస్తున్న రిజిస్టర్ పై సంతకం చేశారు. అర్హత కలిగిన ప్రతీ ఒక్క పౌరుడు భారత ఎన్నికల ప్రక్రియలో చురుకుగా పాల్గొనాలని ఆయన కోరారు. దేశ నిర్మాణంలో ఓటు ప్రాథమిక పాత్ర పోషిస్తుందన్నారు. భారత ఎన్నికల సంఘం ఎల్లప్పుడూ ఓటర్లకు అండగా నిలుస్తుందని అన్నారు. కేరళ కేడర్ కు చెందిన జ్ఞానేష్ కుమార్ ముగ్గురు సభ్యుల ఎన్నికల కమిషన్ ప్యానెల్ కు నాయకత్వం వహించనున్నారు. ఆయన మిగిలిన ఇద్దరు కమిషనర్ల కంటే సీనియర్ -ఉత్తరాఖండ్ కేడర్ కు చెందిన ఐఏఎస్ అధికారి సుఖ్బీర్ సింగ్ సంధు, హర్యానా కేడర్ కు చెందిన 1989 బ్యాచ్ ఐఏఎస్ అధికారి వివేక్ జోషి. భారత 25వ ప్రధాన ఎన్నికల కమిషనర్ గా పనిచేసిన సీఇసీ రాజీవ్ కుమార్ మంగళవారమే తన పదవికి రాజీనామా చేశారు. నూతన కమిషనర్ నాయకత్వంపై ఆయన తన పూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.