బంగ్లా, కెనడాలను నిశితంగా గమనిస్తున్నాం
విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: బంగ్లాదేశ్, కెనడాల్లో రాజకీయ గందరగోళాన్ని భారత్ నిశితంగా గమనిస్తుందని, అదే సమయంలో రష్యాలో చిక్కుకుపోయిన 96మంది భారతీయులను వెనక్కి రప్పించామని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జై స్వాల్ అన్నారు. శుక్రవారం న్యూ ఢిల్లీలో విలేఖరుల అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. భారత్ అన్ని దేశాలతోనూ సత్సంబంధాలనే కోరుకుంటుందన్నారు. అందుకే ప్రతి ఒక్క అంశంపై బంగ్లా, కెనడాలకు తమ ఉద్దేశ్యాలను స్పష్టంగా తెలియజేశామన్నారు. భారత్ వైఖరి ఈ విషయంలో స్పష్టంగా ఉందన్నారు. అలాగే సరిహద్దులో స్మగ్లింగ్, నేర కార్యకలాపాలు, మానవ అక్రమ రవాణాను పూర్తి నిర్మూలించే ప్రయత్నాలు కొనసాగుతాయన్నారు. ముళ్ల కంచెలు, సరిహద్దు లైటింగ్, సాంకేతిక పరికరాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇరుదేశాలతో ప్రస్తుతానికి సంబంధాలు అంత బాగా లేనట్లు కనిపించినా తాము వాటిని చక్కదిద్దే ప్రయత్నాలను చేస్తున్నామని జైస్వాల్ చెప్పారు. రష్యా సైన్యం పనిచేస్తున్న 12 మంది భారతీయులు ఇప్పటివరకు మృతి చెందారని అన్నారు. భారతీయ పౌరులపై 126 కేసులు నమోదయ్యాయన్నారు. 96 మంది భారతీయులను వెనక్కు తీసుకువచ్చామన్నారు.