అందరి చూపు నిర్మలమ్మ వైపు
All eyes are on Nirmalamma
ఆరు రంగాలపై వరాలు?
తొలివరుసలో ఇంధనం, ఆదాయం
మలివరుసలో రైతులు, యువత
మూడో వరుసలో
ఆరోగ్యం, సొంతిళ్ల పైనే సామాన్యుడి ఆశలు
నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: ఫిబ్రవరి 1న విడుదల కానున్న కేంద్ర బడ్జెట్ లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆరు పెద్ద ప్రకటనలు చేయొచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ ఆరు ప్రకటనలతో సామాన్య, మధ్య తరగతి వర్గాలకు భారీ ఊరట చేకూర్చనున్నట్లు తెలుస్తుంది. అదే జరిగితే దేశ ప్రజల్లో మోదీ గ్రాఫ్ మరింత పెరగనుంది. ప్రస్తుతం అందరి చూపు నిర్మలమ్మ ప్రకటనపైనే ఉంది. అయితే ఆ ఆరు ప్రకటనలు ఎంటనే విషయం మాత్రం తెలియడం లేదు. చూచాయగా చూస్తే ఇంధనం ధరల తగ్గింపు, ఆదాయపు పన్ను, కేంద్ర పథకాలు, గ్రామీణ ప్రాంత యువతకు స్కిల్స్ లో శిక్షణ, వైద్యం, ఇళ్లపై పలు ఉద్దీపనలు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
ఇంధనం ధరల తగ్గింపు..
పెట్రోల్, డీజిల్ ధరల పట్ల సామాన్యుల్లో ఒకింత అసహనం ఉందనే చెప్పాలి. అసలు కన్నా కొసరే ఎక్కువన్నట్లు మనం కొంటున్న ఇంధనం ధర కంటే కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు విధిస్తున్న పన్నుల వాటాలనే ఎక్కువగా ఉండడంతో సామాన్యుడికి చుక్కలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం పెట్రోల్ పై రూ. 19.9 పైసలు, డీజిల్ పై రూ. 15.80 పైసలు ఎక్సైజ్ సుంకాన్ని విధిస్తున్నారు. సీఐఐ (భారత పరిశ్రమల సమాఖ్య) ఇంధనంపై సుంకాన్ని తగ్గిస్తే దేశ ప్రజలకు ఊరట లభిస్తుందని, పలు నిత్యావసరాల ధరలు కూడా దిగి వస్తాయని ఇప్పటికే కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.
ఆదాయపు పన్ను..
ఆదాయపు పన్ను పరిమితి వార్షికాదాయానికి రూ. 10 లక్షల వరకు పన్ను రహితంగా పెంచే అవకాశం ఉంది. రూ 15 నుంచి రూ. 20 లక్షల మధ్య ఆదాయానికి 25 శాతం కొత్త పన్ను శ్లాబును ప్రకటించే అవకాశం ఉంది. అదే సమయంలో ప్రాథమిక మినహాయింపు పరిమితిని రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచే అవకాశం ఉంది. ఇదే జరిగితే సామాన్యుడికి భారీ ఊరట చేకూరనుంది.
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పెంపు..
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి రూ.6 వేల నుంచి రూ.12 వేలకు పెంచే అవకాశం ఉందని పలు వర్గాలు భావిస్తున్నాయి. అదే సమయంలో అంతపెద్ద పెంపు ఉండకపోవచ్చనే వాదనలూ ఉన్నాయి. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం 9.4 కోట్ల మంది రైతులకు మూడు విడతల్లో రూ. 2వేల చొప్పున ఏడాదిలో రూ. 6వేలను అందజేస్తుంది. రూ. 12వేలుగా పెంచితే ఆ లోటు భర్తీని ఎలా పూడ్చుకోబోతుందనే ప్రశ్నలు కూడా ఉత్పన్నం అవుతున్నాయి. మరోవైపు రైతులను ఆధునిక పద్ధతిలో సాగుకు సిద్ధం చేసేందుకు భారీ కేటాయింపులు ఉండనున్నట్లు భావిస్తున్నారు.
యువతకు ఇంటర్న్ షిప్..
వివిధ మంత్రిత్వ శాఖల ద్వారా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని యువతలో నైపుణ్యాలను మెరుగుపరిచే దిశగా కేంద్రం అడుగులు వేస్తుంది. ఈ కార్యక్రమాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించింది. అన్ని శాఖలు ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి గ్రామీణ ప్రాంతాల్లోని యువకుల్లో నైపుణ్యాన్ని పెంపొందించే చర్యలను చేపట్టనుంది. ఇందుకు బడ్జెట్ లో భారీగానే కేటాయింపులు ఉండొచ్చనే ఆశిస్తున్నారు. ఇంటిగ్రేటెడ్ ఎంప్లాయిమెంట్ పాలసీ లాంటివి తీసుకువచ్చే అవకాశం ఉంది. చదువుకున్న నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వ పథకాలు దోహదం చేయనున్న నేపథ్యంలో బడ్జెట్ లో వీటిపై నిరుద్యోగుల ఆశలను సజీవంగా ఉంచనున్నారా? అనేది ముందు ముందు తెలుస్తుంది.
వైద్య విద్య, ఆరోగ్యం..
వైద్య విద్యలో 75 వేల సీట్లను వచ్చే ఐదేళ్లలో పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. రోడ్ మ్యాప్ సహకారానికి నిధులు కేటాయింపు ఎలా ఉంటుందో చూడాలి. ఆరోగ్య రంగ బడ్జెట్ 10 శాతం పెంచే అవకాశం ఉంది. గతేడాది ఆరోగ్యానికి రూ. 90,958వేల కోట్లను కేటాయించారు. అదే సమయంలో దిగుమతి వైద్య పరికరాలపై సుంకాన్ని తగ్గించాలనే డిమాండ్ ఉంది. ప్రస్తుతం 7.5 శాతం నుంచి 10 శాతం వరకు సుంకాలు విధిస్తున్నారు. సుంకాలు తగ్గిస్తే మరిన్ని ఆసుపత్రుల్లో అత్యాధునిక వైద్యం ప్రజలకు అందుబాటులోకి రానుంది.
నిరుపేదలు, మధ్యతరగతికి సొంతిళ్లు..
నిరుపేదలు, మధ్యతరగతి వారి సొంతింటి కళపై ఆర్థిక శాఖ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనే సందేహం అందరిలోనూ నెలకొంది. ప్రస్తుతం రియల్ రంగం కొనసాగుతున్నప్పటికీ ఊపు మాత్రం లభించడం లేదనే వాదనలున్నాయి.పైగా రియల్ వ్యాపారులపై పన్ను భారాలు, సవాలక్ష ఆంక్షలు ఉంటుండడంతో తక్కువ ధరల్లో ఇళ్ల లభ్యత అనేది కలగానే మిగిలిపోతుంది. ఈ రంగంలోకి అడుగిడాలంటేనే జంకాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రస్తుతం కొనుగోలు దారులకు పీఎం ఆవాస్ యోజన కింద ప్రయోజనం చేకూరుతున్నప్పటికీ, వ్యాపార వర్గాలకు కూడా ఉపశమనం లభిస్తే రియల్ రంగం మరింత పుంజుకునే అవకాశం ఉంది. అయితే మెట్రో నగరాల్లో సరసమైన గృహాల ధరల పరిమితిని రూ. 45 లక్షల నుంచి రూ. 70 లక్షలకు పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అంటే ఇళ్ల కొనుగోలు రూ. 70 లక్షల ధర ఉంటే కేంద్ర ప్రభుత్వం మినహాయింపు లభిస్తుంది. ఇతర నగరాలకు ఈ పరిమితిని రూ. 50 లక్షలుగా ఉంది. గృహ రుణ వడ్డీపై పన్ను మినహాయింపు రూ. 5 లక్షలకు పెంచే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇది రూ. 2 లక్షల వద్ద కొనసాగుతుంది. అయితే దేశంలో 1.01 సరసమైన గృహాల కొరత ఉండడంతో ప్రభుత్వం రియల్ రంగ విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది.