ప్రముఖుల ఓట్లు–1 ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలి ప్రధాని మోదీ ట్వీట్
Votes of celebrities – 1 should win democracy PM Modi's tweet

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఏడోదశ ఎన్నికలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. చివరి దశలో 7 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని 57 స్థానాలకు శనివారం (జూన్ 1) పోలింగ్ ప్రారంభమైంది. 57 స్థానాలకు గాను 904 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా 809 మంది పురుషులు, 95 మహిళా అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఆరుదశల్లో 485 స్థానాలకు పోలింగ్ పూర్తి అయ్యింది.
ప్రధాని మోదీ ట్వీట్..
లోక్ సభ చివరి విడత ఎన్నికల్లో అందరూ ఉత్సాహంగా పాల్గొని ఓటు వేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో అత్యధిక సంఖ్యలో ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేశారు. యువకులు, మహిళలు అధిక సంఖ్యలో ఓటు వేసేందుకు వస్తారని తనకు నమ్మకముందన్నారు. అందరం కలిసి ప్రజాస్వామ్యాన్ని గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు.
యోగి ఆదిత్యనాథ్..
గోరఖ్ పూర్ లోని పోలింగ్ కేంద్రంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. తన వేలికున్న సిరా గుర్తును ప్రజలకు చూపుతూ అత్యధిక సంఖ్యలో ఓటు వేయాలని పిలుపునిచ్చారు. దశాబ్దాల తరువాత ఇంత ఎండ తీవ్రత నమోదవుతున్నా ప్రజలు స్వచ్ఛందంగా ఓటు వేసేందుకు రావడం అభినందనీయమని యోగి అన్నారు. ప్రజాస్వామ్యాన్ని గెలిపించుకుంటే దేశం సురక్షితంగా ఉంటుందని యూపీ ప్రజలకు తెలుసన్నారు.
గోరఖ్ పూర్ రవికిషన్..
యూపీ గోరఖ్ పూర్ అభ్యర్థి నటుడు రవికిషన్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈసారి మోదీ హ్యాట్రిక్ సాధించడం ఖాయమన్నారు.
కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్
కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కుటుంబ సభ్యులతో కలిసి హమీర్ పూర్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. గెలుపు ఖాయమేనని సీట్ల సంఖ్య కూడా 400 దాటుతామని తమకు విశ్వాసం ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ లోపభూయిష్ట రాజకీయాలకు పాల్పడుతూ ప్రజల నమ్మకాన్ని విశ్వాసాన్ని కోల్పోయిందన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో హ్యాట్రిక్ విజయం ఖాయమేనని అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు.
పార్టీ, ప్రజలు తనను నాలుగుసార్లు ఆశీర్వదించారన్నారు. మరోమారు తనకే ప్రజల ఆశీర్వాదం లభిస్తుందన్నారు. హిమాచల్ లో అన్ని సీట్లలో బీజేపీ విజయం సాధిస్తుందని పేర్కొన్నారు. రెండుసార్లు హస్తం పార్టీ ఓడిపోయిందని తీవ్ర నిరాశ నిస్పృహల్లో ఉండి వారు ఏం మాట్లాడుతున్నారో వారికే తెలియడం లేదన్నారు.
కంగనా రౌనత్..
హిమాచల్ ప్రదేశ్ మండి లో బీజేపీ ఎంపీ అభ్యర్థి కంగనా రౌనత్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్యంలో అందరూ ఓటు వేయాలని తాను ఓటు హక్కు వినియోగించుకున్నానని అన్నారు. ఓటు హక్కు అధికారాన్ని పూర్తిగా వినియోగించుకోవాలన్నారు. మోదీ నేతృత్వంలో 200 వరకు ర్యాలీలు, ప్రసంగాలు, 80 ఇంటర్వ్యూలు చేశామన్నారు. తాము మోదీ సైనికులమన్నారు. మండి ప్రజల ఆశీర్వాదం తమ వెంటే ఉంటుందన్న విశ్వాసం ఉందన్నారు. మోదీ జీవన శైలిలో ధ్యానం ఒక భాగమన్నారు. ఎన్నికల స్టంట్ అని విపక్షాలు అనడం వారి అవివేకమన్నారు. హిమాలయాల్లో కూడా ప్రధాని మోదీ ధ్యానం చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
రవిశంకర్ ప్రసాద్..
పాట్నా సాహిబ్ నుంచి బీజేపీ నుంచి ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు. ఆయన పాట్నాలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పగటి కలలు కంటోందన్నారు. మోదీ నేతృత్వంలో ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఎవ్వరు ఎన్ని కుట్రలు, కుయుక్తులు పన్నినా ప్రజలు తమవైపే ఉన్నారని రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు.
మిథున్ చక్రవర్తి ఓటు వేశారు..
బీజేపీ నేత, నటుడు మిథున్ చక్రవర్తి కోల్ కత్తాలో ఓటు వేశారు. ఓటువేసేందుకు ఆయన క్యూలైన్లో 40 నిమిషాలపాటు నిలుచుకున్నారు. తన కర్తవ్యాన్ని సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నానని, మీరంతా కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని మిథున్ చక్రవర్తి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
అనుప్రియ పటేల్..
కేంద్ర మంత్రి, మీర్జాపూర్ లోక్‌సభ స్థానం నుంచి అప్నా దళ్ (సోనేలాల్) అభ్యర్థి అనుప్రియ పటేల్ పోలింగ్ బూత్‌కు చేరుకుని ఓటు వేశారు. మోదీ నేతృత్వంలో మరోమారు హ్యాట్రిక్ సాధించడం ఖాయమన్నారు. పదేళ్ల అభివృద్ధిని ప్రజలు కళ్లారా చూసి మరోమారు తమకు అవకాశం ఇవ్వబోతున్నారని అనుప్రియ పటేల్ స్పష్టం చేశారు. మోదీ నేతృత్వంలోని కూటమి పార్టీలన్నీ విజయం సాధిస్తారన్న నమ్మకాన్ని అనుప్రియ పటేల్ వ్యక్తం చేశారు.
బిహార్ ఉప ముఖ్యమంత్రి విజయ్ సిన్హా..
ప్రజాస్వామ్యంలో అతిగొప్ప పండుగ రోజన్నారు. అందరూ తప్పకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. పాట్నాలో ఉప ముఖ్యమంత్రి విజయ్ సిన్హా కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు.
నిషికాంత్ దూబే..
గొడ్డా లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి నిషికాంత్ దూబే ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. బాబా ఆశీర్వాదం, మోదీ నేతృత్వంలో తన విజయం ఖాయమని తొలుత నుంచి చెబుతున్నానని ఇప్పుడు కూడా అదే చెబుతున్నానని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతీ ఒక్కరూ అత్యధిక సంఖ్యలో ఓటింగ్ లో పాల్గొనాలని నిషికాంత్ దూబే విజ్ఞప్తి చేశారు.