నిర్భయంగా ఓటు వేయాలి
16.63 కోట్ల మంది ఓటర్లు పోటీలో 1625 మంది అభ్యర్థులు 102 పార్లమెంటరీ, 92 అసెంబ్లీ నియోజకవర్గాలకు తొలివిడత పోలింగ్ ఐదువేల పోలింగ్ స్టేషన్లను నిర్వహిస్తున్న మహిలలు వెయ్యి పోలింగ్ స్టేషన్లను నిర్వహిస్తున్న దివ్యాంగులు సౌకర్యాల కల్పన పూర్తి ఓటు ప్రాముఖ్యతను వివరించిన కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి రాజీవ్ కుమార్
న్యూఢిల్లీ: తొలివిడత 2024 ఎన్నికల్లో ఓటర్లు నిర్భయంగా ఓటు వేయాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రధానాధికారి రాజీవ్ కుమార్ తెలిపారు. శుక్రవారం తొలివిడత ఎన్నికల సందర్భంగా రాజీవ్ కుమార్ గురువారం మీడియాతో మాట్లాడారు. ఓటర్లు ఎలాంటి భయాందోళన చెందవద్దని ఉత్సాహంగా ఓటు వేయాలని తెలిపారు.
తొలివిడత ఎన్నికల్లో 16.63 కోట్ల మంది ఓటర్లు కాగా, 1625 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఓటు ప్రాముఖ్యతను ఆయన ఓటర్లకు వివరించారు. ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించేందుకు ఓటర్లు నిర్భయంగా ఓటు వేసేందుకు అన్ని సౌకర్యాలను కల్పించామన్నారు.
తొలివిడత పోలింగ్..
తొలిదశ పోలింగ్ 21 రాష్ట్రాలు/యూటీలలోని 102 పార్లమెంటరీ నియోజకవర్గాలలో జరుగుతుందన్నారు. (జనరల్-73; ఎస్టీ-11; ఎస్సీ-18), 92 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఏప్రిల్ 19న పోలింగ్ జరుగుతుందని స్పష్టం చేశారు. అరుణాచల్, సిక్కిం రాష్ట్రాల్లో ఒకేసారి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్యని వివరించారు. అన్ని దశలతో పోలిస్తే పార్లమెంటరీ నియోజకవర్గాల సంఖ్య మొదటి విడతలోనే అత్యధికంగా ఉందన్నారు. ఓటింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు ముగుస్తుందని రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. 1.87 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఓటర్లలో 8.4 కోట్ల మంది పురుషులు , 8.23 కోట్ల మంది మహిళలు, 11,371 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారని స్పష్టం చేశారు. ఇందులో తొలిసారిగా 35.67 లక్షల మంది ఓటు వేయనున్నారని పేర్కొన్నారు. 20-29 ఏళ్ల మధ్య వయస్సు గల యువ ఓటర్లు 3.51 కోట్ల మంది ఉన్నారని రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు.
పోలింగ్ ఏర్పాట్లు..
పోలింగ్, భద్రతా సిబ్బందిని తరలించేందుకు 41 హెలికాప్టర్లు, 84 ప్రత్యేక రైళ్లు, సుమారు లక్ష వాహనాలను వినియోగిస్తున్నామని స్పష్టం చేశారు. ఓటింగ్ ప్రక్రియను సజావుగా చేపట్టేందుకు భారీగా భద్రతా బలగాలను మోహరించామని పేర్కొన్నారు. 50 శాతానికి పైగా పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ ద్వారా పర్యవేక్షిస్తామని రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. మైక్రో అబ్జర్వర్‌లతో పాటు అన్ని పోలింగ్ కేంద్రాల్లో 361 మంది పరిశీలకులను నియమించామని తెలిపారు. ఇందులో 127 మంది జనరల్ సూపర్‌వైజర్లు, 67 మంది పోలీసు సూపర్‌వైజర్లు, 167 మంది ఫైనాన్షియల్ సూపర్‌వైజర్లను నియమించామని వివరించారు. వీరితో పాటు 85 ఏళ్లు పైబడిన ఓటర్లు 14.14 లక్షలకు పైగా నమోదు కాగా 13.89 లక్షల మంది వికలాంగ ఓటర్లు ఉన్నారని స్పష్టం చేశారు. 85 ఏళ్లు పైబడిన దివ్యాంగ ఓటర్లు, పోలింగ్ కేంద్రాలకు వచ్చేందుకు పిక్ అండ్ డ్రాప్ సౌకర్యం కల్పించామని వివరించారు. పీడబ్ల్యూడీ ఓటర్లు ఈసీఐ ప్రారంభించిన యాప్ ద్వారా సౌకర్యాలను కూడా వినియోగించుకోవచ్చన్నారు. 102 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో లోకల్ థీమ్‌తో మోడల్ పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశామని తెలిపారు. 5000 కంటే ఎక్కువ పోలింగ్ స్టేషన్‌లు పూర్తిగా మహిళలే నిర్వహిస్తున్నారని స్పస్టం చేశారు. 1000 కంటే ఎక్కువ పోలింగ్ స్టేషన్‌లను దివ్యాంగులు ఓటింగ్ ప్రక్రియను కొనసాగించనున్నారని రాజీవ్ కుమార్ తెలిపారు.
సౌకర్యాల కల్పన..
పోలింగ్ స్టేషన్‌ను గ్రౌండ్ ఫ్లోర్‌లో నిర్మించామని, ఓటర్లకు తాగునీరు, మరుగుదొడ్లు, షెడ్, ర్యాంప్, వీల్‌చైర్, హెల్ప్ డెస్క్, వాలంటీర్లు అందుబాటులో ఉంటారని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. ఓటరు సమాచార స్లిప్పులను కూడా ఓటర్లకు వారి నివాసాలకు పంపామని వివరించారు. వేసవి తాపాన్ని గుర్తించి, దానిని నివారించడానికి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్యం అనేది బలహీనులకు, బలవంతులకు సమాన అవకాశాలను ఇచ్చేది ఓటు అనే ఆయుధం ద్వారానే అనేది గుర్తుంచుకోవాలన్నారు. ఓటు శక్తిని తక్కువ అంచనా వేయవద్దని స్పష్టం చేశారు. అన్ని రాజకీయ పార్టీలు ఓటింగ్ శాతం ఎక్కువగా జరిగేందుకు ప్రయత్నించాలని, సహకరించాలని రాజీవ్ కుమార్ విజ్ఞప్తి చేశారు.