ఆర్పీల చేతివాటం అధికారుల సహాయంతో యథేచ్ఛగా వసూళ్లు
రుణాలలో కమిషన్లు ఇవ్వకుంటే ఎంసీపీలను నమోదు చేయని అధికారులు ఆర్పీలు, సంఘం లీడర్లు, అధికారుల గ్యాంబ్లింగ్ గేమ్ ఉన్నతాధికారులు పట్టించుకొని చర్యలు తీసుకోవాలంటున్న మహిళా సభ్యులు
నా తెలంగాణ, డోర్నకల్: తెలంగాణలో మహిళ సంఘాల సభ్యులను కోటీశ్వరులు చేయాలనే దృఢ సంకల్పంతో ఉన్న కొత్త ప్రభుత్వానికి ఆర్పీలు తలనొప్పిగా మారారు. సంఘాల్లోని సభ్యులకు రుణాలిచ్చేందుకు రూ. 15 నుంచి రూ. 30వేలు లంచాలు డిమాండ్ చేస్తున్నట్లుగా ఆరోపణలున్నాయి. మరిపెడ మున్సిపాలిటీ అడ్డాగా యథేచ్ఛగా వీరి కార్యకలాపాలు మూడు పువ్వులు, ఆరు కాయలుగా కొనసాగుతున్నాయనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. స్త్రీ నిధి నుంచి వ్యక్తిగత రుణాలైతే రూ. 1000, గ్రూపు రుణం రూ. 20 లక్షల వరకు ఉంటే రూ. 15వేలు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్పీలకు జిల్లా కార్యాలయంలో పనిచేసే ఇద్దరు అధికారులు కూడా పూర్తి సహాయ సహకారాలు అందజేస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్పీలకు అడిగినంత ముట్టజెప్పకుంటే రుణాల కోసం చేయాల్సిన ఎంసీపీలను ఈ అధికారులు నమోదు చేయరని ఆరోపిస్తున్నారు. ఎంసీపీల కోసం రూ. 4 నుంచి రూ. 5వేల వరకు ముట్టజెప్పాల్సి వస్తోందని వాపోతున్నారు. ఆర్పీలు ఇటు అధికారులతో, అటు సంఘం లీడర్లతో చేతులు కలిపి గ్యాంబ్లింగ్ గేమ్ లకు పాల్పడుతూ.. సంఘం సభ్యురాళ్లతో అందిన కాడికి దోచుకుంటున్నారనే విమర్శలు వినవస్తున్నాయి. ఇలాంటి వారిపై, అధికారులపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని సంఘం సభ్యులు కోరుతున్నారు.