తండా సమస్యలపై ఎమ్మెల్యే ఫైర్​

MLA fire on Tanda issues

Jul 24, 2024 - 17:34
Jul 24, 2024 - 17:52
 0
తండా సమస్యలపై ఎమ్మెల్యే ఫైర్​
  • అడవితల్లిని నమ్ముకున్న వారికి ఆది నుంచి అన్యాయమే
  • రైతుల ఆత్మహత్యలు, ఉపాధి లేక వలసబాటలు
  • తండాలను రెవెన్యూ గ్రామపంచాయతీలుగా గుర్తించి ఆదుకోవాలి
  • ఆర్థిక స్వావలంభన దిశగా చర్యలు చేపట్టాలి
  • అసెంబ్లీలో గిరిజన లంబాడా సమస్యలపై ఎమ్మెల్యే రాంచంద్రునాయక్​

నా తెలంగాణ, డోర్నకల్: తెలంగాణ  రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏ ఒక్క తండా గ్రామ పంచాయితీ ని రెవెన్యూ గ్రామ పంచాయతీగా గుర్తింపు ఉన్నా పూర్తిస్థాయిలో గుర్తించకపోవడం శోచనీయం అని డోర్నకల్​ నియోజకవర్గ శాసనసభ్యుడు, ప్రభుత్వ చీఫ్​ విప్​ డాక్టర్​ రామచంద్రునాయక్​ ఆవేదన వ్యక్తం చేశారు.  

బుధవారం అసెంబ్లీ సమవేశాల సందర్భంగా తండాల్లోని గిరిజన లంబాడాల ఈతిబాధలపై అసెంబ్లీలో తనదైన శైలిలో గళం విప్పారు. ఆది నుంచి అడవినే నమ్ముకొని బతుకీడుస్తున్న వీరికి ప్రభుత్వం తరఫున అందుతున్న సాయం ఏమీ లేదన్నారు. అనేక కష్టనష్టాలకు ఓర్చి జీవితాన్ని గడుపుతున్నారని వాపోయారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక ఎంతోమంది లంబాడా రైతులు ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఓ వైపు పంటలు సరిగ్గా పండగ ఎంతోమంది కుటుంబ పోషణ కోసం తండాల నుంచి కూలీ నాలీ చేసుకునేందుకు పట్టణాలకు వలస వెళ్లడం బాధాకరమన్నారు. అదే సమయంలో విద్యనభ్యసించిన తండాల్లోని యువతకు ఉపాధి అవకాశాలు లేక తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఎదురవుతున్నాయని వాపోయారు. వారిని ఏ ప్రభుత్వ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఎన్నికలు వచ్చినప్పుడల్లా మాయమాటలు చెబుతూ ఓట్లను దండుకుంటూ అటుపిమ్మట తండాల వైపు తిరిగ కూడా చూడరని మండిపడ్డారు. పలు గ్రామపంచాయితీలను మున్సిపాలిటీలుగా తీర్చిదిద్దినా అక్కడి గిరిజన లంబాడాల ఆర్థిక పరిస్థితుల్లో మార్పు లేదన్నారు. దీంతో పన్నుల భారం మోయలేకపోతున్నారని తెలిపారు. 

ఇప్పటికైనా ప్రభుత్వ ఆయా అంశాలపై దృష్టి సారించాలన్నారు. గతంలో రెవెన్యూ గ్రామపంచాయితీలుగా గుర్తింపు ఉన్న తండాలను రెవెన్యూ గ్రామపంచాయతీ గా గుర్తించి సకాలంలో నిధులను అందించి ఆదుకోవాలన్నారు. రైతులను, యువతను ఆదుకోవాలని, ఉపాధి కల్పనను మెరుగుపరచాలని తండాలను రక్షించుకునే బాధ్యత ప్రభుత్వం ఉందని రాంచంద్రునాయక్​ అన్నారు. తండాలకు పూర్తి ఆర్థిక స్వావలంభన దిశగా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గిరిజన తండాల అభివృద్ధి కోసం తనవంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు.