విచ్ఛిన్నానికి ప్రతిపక్షాల కుట్ర
ఉగ్రవాదం, నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించాం
అభివృద్ధి పనులకు అడుగడుగునా కాంగ్రెస్ అడ్డంకులు
కుటీల నీతిని తిప్పికొట్టాల్సిన సమయం ఆసన్నం
ముంబాయి: ఐక్యంగా ఉంటేనే సురక్షితంగా ఉంటామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. దేశ ఐక్యతను విచ్ఛిన్నం చేసే ప్రమాదకరమైన ఆటను కాంగ్రెస్ ఎంచుకుందన్నారు. ఆదివాసీ, గిరిజన సమాజాన్ని కులాలవారీగా విడగొట్టాలని కుటిల పన్నాగాలు పన్నిందన్నారు. తామే ఈ దేశాన్ని పాలించాలనే కుట్రను ఈ కుటుంబం కలిగి ఉందని విమర్శించారు. బీజేపీ దేశ ప్రజలందరి సంక్షేమం కోసం పనిచేస్తోందన్నారు. ఉగ్రవాదం, నక్సలిజం, రౌడీయిజం లాంటి అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపుతూ దేశాన్ని సురక్షితంగా ఉంచే దిశగా బీజేపీ ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. మహారాష్ర్టలో చేపడుతున్న అభివృద్ధి పనులను అడ్డుకునేందుకు ప్రయత్నించిందని కానీ మోదీ నేతృత్వంలో ఈ ప్రాజెక్టులను ఎవ్వరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు. మహారాష్ర్టలో వందకంటే ఎక్కువ రైళ్లను పునరుద్ధరించే చర్యలను చేపట్టామన్నారు. అత్యధికంగా మహారాష్ర్టలో 12 వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయని తెలిపారు. మహారాష్ర్ట ప్రజలు మహావికాస్ అఘాడీ కుటిల నీతిని తిప్పికొట్టాల్సిన సమయం ఆసన్నమైందని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. ఎన్నికలలో బీజేపీ ప్రభుత్వాన్ని ఎన్నుకొని మహా అభివృద్ధికి మరింత ఊతం చేకూర్చుకోవాలన్నారు.
రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వలేదు..
మంగళవారం మహారాష్ర్టలోని చిమూర్ లో జరిగిన ఎన్నికల ప్రచార బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్, ప్రతిపక్షాల తీరుపై విరుచుకుపడ్డారు. విదేశాల్లో భారత్ పరువును తీసేందుకు కూడా ఈ యువరాజు అనేకసార్లు ప్రయత్నించారని గుర్తు చేశారు. దళితులు, వెనుకబడిన వర్గాలు, తరగతులు, గిరిజనుల రిజర్వేషన్లు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఎందుకు చేపట్టలేకపోయారో ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. తాము రిజర్వేషన్లపై ముందుకు వెళితే కాంగ్రెస్ కు మంటలు ఎందుకు పుడుతున్నాయని ప్రశ్నించారు. తాము దేశాన్ని పాలించేందుకే పుట్టామన్న ధోరణిలో కాంగ్రెస్ వ్యవహారశైలి ఉందని ఆరోపించారు.
నక్సలిజం నుంచి అభివృద్ధి దిశగా..
ఓ వైపు రైతులు, మహిళలు, యువత, పరిశ్రమలు, విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు, రోడ్లు, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు ఇలా అనేక రకాల ప్రాజెక్టులను దేశంలో చేపడుతూ దినదినాభివృద్ది కోసం ప్రయత్నిస్తున్నామని తెలిపారు. కానీ ప్రతి విషయంలోనూ కాంగ్రెస్ పార్టీ వాటిని అడ్డుకునేందుకు కుట్రలకు తెరతీస్తోందని ఆరోపించారు. మహాయుతి ప్రభుత్వం మహారాష్ర్ట ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందని మోదీ స్పష్టం చేశారు. చిమూర్, గడ్చిరోలి, చంద్రాపూర్ లో నక్సలిజాన్ని నిర్మూలించడంతో ఈ ప్రాంతంలో అనేక నూతనావకాశాలు సృష్టిస్తున్నామని తెలిపారు. ఇది ఈ ప్రాంతాల అభివృద్ధికి చిరునామాలుగా రూపుదిద్దుతామని స్పష్టం చేశారు. ఈ ప్రాంత వాసులు మహా వికాస్ అఘాడీ పార్టీలను తరిమికొట్టాల్సిన అవసరం ఉందన్నారు. లేకుంటే మళ్లీ ఈ ప్రాంతాల్లో నక్సలిజం మంటలను రెచ్చగొట్టి రక్తపు ఆటల కొనసాగే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
370 అమలు చేసే కుట్రలు..
ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూకశ్మీర్ పూర్తి ప్రశాంతంగా ఉందన్నారు. అక్కడి అభివృద్ధిని ఒక్కసారి గమనించాలన్నారు. కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు ఆర్టికల్ 370ని అమలు చేయాలని పాక్ కు మేలు చేసే విధానాలను అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. మాతృభూమిలో జెండా ఎగురవేసే తాహతు లేని ఈ పార్టీలు దేశాన్ని ఏం కాపాడుతాయని మండిపడ్డారు. వీరి కుటీల రాజకీయాల వల్ల ఎందరో వీర జవాన్లు ప్రాణాలర్పించారని ఆరోపించారు.
చంద్రాపూర్ లో రైలు ప్రాజెక్టును అడ్డుకున్నదెవరు?..
మహారాష్ర్ట అభివృద్ధి మహావికాస్ అఘాడీతో చేతకాదన్నారు. వాద్వాన్ పోర్టు, సమృద్ధి మహామార్గ్ లాంటి ప్రాజెక్టులకు అడ్డుకునేందుకు ఈ కూటమి పార్టీలు కుట్రలు, కుతంత్రాలు పన్నాయని ఆరోపించారు. చంద్రాపూర్ లో రైలు ప్రాజెక్టు ఆపేందుకు ప్రయత్నించింది ఎవరో ఈ ప్రాంత వాసులకు బాగా తెలుసన్నారు. విమానాశ్రయాలు, ఎక్స్ ప్రెస్ హైవేలు, వందేభారత్ రైళ్లు, స్టేషన్ల నిర్మాణం, రైల్వే మార్గాల విస్తరణలు చేపడుతుందన్నారు.
బీజేపీ మేనిఫెస్టో భేష్..
బీజేపీ ఇచ్చిన మేనిఫెస్టో రాష్ర్ట అభివృద్ధికి, రైతులు, మహిళలు, నిరుద్యోగులు, యువశక్తిని ప్రతిబింబించేలా ఉందని హర్షం వ్యక్తం చేశారు. మహారాష్ర్ట ఎన్నికలలో మరోమారు మహాయుతికి అధికారం అందించి డబుల్ ఇంజన్ అభివృద్ధిని మరింత వేగవంతం చేసే చర్యలకు మద్ధతు తెలపాలని ప్రధాని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.