యూపీ ఆర్థిక వ్యవస్థకు రూ. 3 లక్షల కోట్ల లాభం!
అసెంబ్లీలో సీఎం యోగి ఆదిత్యనాథ్

లక్నో: మహాకుంభ్ మేళా విజయవంతంగా నిర్వహిస్తుండడంతో యూపీ ఆర్థిక వ్యవస్థకు రూ. 3 లక్షల కోట్ల లాభం చేకూరనుందని సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. శుక్రవారం అసెంబ్లీలో సీఎం విపక్షాల ఆరోపణలు ఖండిస్తూనే మేళా నిర్వహణ లాభాలపై వివరణనిచ్చారు. యూపీ ప్రభుత్వం ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారే దిశలో పయనిస్తుందన్నారు. ఈ దిశగా మహాకుంభ మేళా నిర్వహణ విజయవంతమైన కార్యక్రమన్నారు. భారత్ ఎప్పటికీ అభివృద్ధి చెందలేదని చెబుతున్న మీ నాయకుల తీరు బాధకరమైందన్నారు. ఇలాంటి నాయకులు దేశ ఆర్థిక విచ్ఛిన్నానికి కారణమవుతున్నారని మండిపడ్డారు. 2027 వరకు దేశం ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందుతుందనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. 2022 నుంచి యూపీని కూడా పది రంగాలుగా విభజించి కార్యక్రమాలను ప్రారంభించామన్నారు. ప్రతీ మూడు నెలలకు ఒకసారి అభివృద్ధిపై సమీక్షిస్తున్నామని తెలిపారు. 2017లో తమ ప్రభుత్వం కొలువైనప్పుడు ఆర్థిక వ్యవస్థ రూ. 12 లక్షల కోట్లుగా ఉందన్నారు. కానీ 2024 చివరి నాటికి రూ. 27.5 లక్షల కోట్లకు చేరిందన్నారు. కరోనా మహామ్మారిని సైతం పారద్రోలి ఈ వృద్ధి దిశగా పయనించడం సంతోషించదగ్గ విషయమన్నారు. ఎంఎస్ఎంఇ, ఐటీ, ఎలక్ట్రానిక్స్, వ్యవసాయం, సామాజిక రంగం, పట్టణాభివృద్ధి, రెవెన్యూ, విద్య, వైద్యం, సేవా, పర్యాటక రంగం ఇలా అన్ని రంగాలను విస్తరిస్తున్నామన్నారు. కేవలం యూపీలోనే పదేళ్లలో ఆరుకోట్ల మందిని పేదరికం నుంచి బయటికి తీసుకువచ్చామన్నారు. ప్రతీ రంగంలోనూ మహిళలకు అపార అవకాశాలను కల్పిస్తున్నామన్నారు. దేశంలోనే సహజ వనరులు సమృద్ధిగా ఉన్న రాష్ర్టాల్లో యూపీ ఒకటని సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు.