మహారాష్ట్ర బస్సుల్లో పోలీసులు?
ప్రభుత్వం యోచిస్తుందన్న మంత్రి

ముంబాయి: మహారాష్ట్ర–కర్ణాటక మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రభుత్వ బస్సుల్లో మార్షల్స్ లేదా పోలీసులను మోహరించాలని ప్రభుత్వం యోచిస్తుందని మహారాష్ట్ర రవాణా శాఖ మంత్రి సర్నాయక్ అన్నారు. రెండురాష్ట్రాల ఉద్రిక్తతలపై సీఎం అధ్యక్షతన ఈ విషయాన్ని సీరియస్ గా పరిశీలిస్తున్నట్లు మంత్రి మంగళవారం మీడియాతో వివరించారు. ప్రయాణీకుల భద్రత గురించి రవాణా మంత్రిగా ఆలోచించాల్సిన అవసరం ఉందన్నార. కొంతమంది సంఘ విద్రోహ శక్తుల వల్ల ప్రమాదం ఉన్నట్లు భావిస్తే మార్షల్ లేదా పోలీసులను బస్సులో నియమిస్తామన్నారు. రాష్ర్ట మంత్రివర్గంలోనూ ఈ అంశం చర్చిస్తున్నట్లు తెలిపారు. మహారాష్ట్రకు, మరాఠీ భాషకు సొంత గౌరవం ఉందన్నారు. రాష్ట్ర ప్రజలను బెదిరిస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. అదే సమయంలో కర్ణాటకకు వచ్చే మహారాష్ట్ర బస్సులకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ఆ రాష్ట్రప్రభుత్వానికి ఉందని మంత్రి సర్నాయక్ అన్నారు.