ఓట్ల కోసమే నీటి బిల్లులు మాఫీ
ప్రకటన కేజ్రీవాల్ పై మండిపడ్డ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్ దేవా

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఓట్లు రాబట్టుకొనేందుకు నీటి బిల్లులు మాఫీ అని సీఎం కేజ్రీవాల్ మభ్యపెడుతున్నారని, ఇంతకాలం నీటి బిల్లులు ఎందుకు మాఫీ చేయలేదని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్ దేవా ప్రశ్నించారు. ఢిల్లీలో అధికారంలో ఉంటూ ఎన్నికలకు ముందు ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఢిల్లీలో బీజేపీకి పెరుగుతున్న మద్ధతును చూసి ఆప్ భయపడుతుందన్నారు. అందుకే తమ ప్రాబల్యాన్ని తగ్గించేందుకే కుటీల యత్నాలకు తెరతీశారన్నారు. కేజ్రీవాల్ చెబుతున్నవన్నీ అసత్యాలేనన్నారు. ఢిల్లీలో నీరు దొరికే పరిస్థితి ఉందా? అని ప్రశ్నించారు. కుళాయి నీటిలో మురికి నీరు వస్తుందని జలబోర్డుకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోని కేజ్రీవాల్ బిల్లుల మాఫీపై ప్రకటిస్తూ తన దుర్నితిని చాటుకున్నారని మండిపడ్డారు. బిల్లులు మాఫీ చేయాలనుకుంటే ఈ రోజు నుంచే చేయాలని సవాల్ విసిరారు. మాఫీపై ప్రవర్తనా నియమావళి విధించారో లేదో చెప్పాలని నిలదీశారు. కాంగ్రెస్, ఆప్ బీజేపీని ఓడించేందుకు ఒకసారి ప్రయత్నించి విఫలమయ్యాయని పేర్కొన్నారు. ఇప్పుడు ఈ రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేస్తూ ఢిల్లీ ప్రజల నిర్ణయాన్ని విడగొట్టాలనుకుంటున్నాయని ఈ విషయాన్ని ప్రజలు గమనించి ఈ రెండు పార్టీలను తిప్పికొడతారని సచ్ దేవా అన్నారు.