కుప్వారాలో ఎన్ కౌంటర్ ఇద్దరు ఉగ్రవాదులు హతం
Two terrorists killed in encounter in Kupwara
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ లోని కుప్వారాలో భద్రతా బలగాలు ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చాయి. శనివారం వేకువజామున ఉగ్రవాదులు సరిహద్దుల వెంట గుగల్ ధర్ నుంచి భారత్ లోకి చొరబడేందుకు యత్నించారు. దీంతో భద్రతాదళాలు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. కాల్పుల సమాచారం తెలుసుకున్న ఉన్నతాధికారులు మరిన్ని బలగాలను ఆ ప్రాంతానికి పంపారు. ఇరువైపులా జరిగిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. వీరి వద్ద నుంచి భారీ ఎత్తున మందుగుండు సామాగ్రి, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతంలో ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. మృతి చెందిన ఉగ్రవాదులకు జైష్ ఏ మహమ్మద్ తో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్నారు.