ఎన్ కౌంటర్ ముగ్గురు ఉగ్రవాదులు హతం
రాజౌరిలో కొనసాగుతున్న గాలింపు
శ్రీనగర్: కుప్వారాలో జరిగిన రెండు వేర్వేరు ఎన్ కౌంటర్లలో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. మచిల్ సెక్టార్ లో ఇద్దరు, తంగ్ ధర్ లో ఒక ఉగ్రవాది హతమైనట్లు అధికారులు గురువారం ప్రకటించారు. మరోవైపు రాజౌరీలో కూడా భద్రతా దళాలకు ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరుగుతున్నాయని తెలిపారు. ఇక్కడ కూడా ముగ్గురు ఉగ్రవాదులు ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.
బుధవారం రాత్రి నుంచి రాజౌరి ప్రాంతంలో కూడా ముగ్గురు ఉగ్రవాదులు ఉన్నారన్న అనుమానంతో సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. గురువారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతాదళాలకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టేందుకు అదనపు బలగాలను రప్పించారు. రాజౌరి నగ్రోటా గ్రామంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులను గుర్తించినట్లు స్థానికుల సమాచారం మేరకు భద్రతాదళాలు సెర్చ్ ఆపరేషన్ కు దిగాయి.