సుంకాల తగ్గింపుతో నష్టం లేదు
గ్లోబల్ ఫైనాన్షియల్ గ్రూప నోమురా నివేదిక

30 శాతం వస్తువులపై సుంకాలు తగ్గించే అవకాశం
కేంద్ర ఆర్థిక విధానంతో భారత్ పై ప్రభావం ఉండబోదు
నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: అమెరికా ట్రంప్ భారత్ పై భారీ సుంకాల ప్రకటన తరువాత భారత్ సుంకాలను తగ్గించేందుకు సిద్ధంగా ఉందని ట్రంప్ ప్రకటించారు. కాగా రెండు దేశాల మధ్య 3.5 లక్షల కోట్ల రూపాయల వ్యాపార లావాదేవీలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సుంకాలు తగ్గించినా, పెద్దగా భారత్ పై ప్రభావం ఉండబోదని ఆర్థిక విశ్లేషకులు, జేఎన్ యూ ప్రొఫెసర్ రాజన్ కుమార్ చెప్పారు. గ్లోబల్ ఫైనాన్షియల్ గ్రూప్ నోమురా నివేదిక ప్రకారం అమెరికా పరస్పర సుంకాన్ని నివారించడానికి భారత్ 30 శాతం కంటే ఎక్కువ వస్తువులపై సుంకాను తగ్గించే అవకాశం ఉంది. దీనివల్ల అమెరికన్ వస్తువులు చౌకగా మారే అవకాశం ఉంది. దీంతో అమెరికన్ రక్షణ, ఇంధన ఉత్పత్తుల కొనుగోళ్లు మరింత పెంచుకోవచ్చు. అదే సమయంలో దేశీయ రక్షణ రంగం బలోపేతంలో ఇతర దేశాల పెట్టుబడులతో అమెరికా రక్షణ ఉత్పత్తుల కొనుగోళ్లు తగ్గించుకునే అవకాశం ఉంది.
2024లో అమెరికా భారతదేశానికి 42 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 3.6 లక్షల కోట్లు) విలువైన వస్తువులను విక్రయించింది. దీనిలో, భారత ప్రభుత్వం కలప ఉత్పత్తులు, యంత్రాలపై 7శాతం, పాదరక్షలు, రవాణా పరికరాలపై 15శాతం నుంచి 20 శాతం, ఆహార ఉత్పత్తులపై 68శాతం వరకు సుంకం విధించింది. వ్యవసాయ ఉత్పత్తులపై అమెరికా సుంకం 5శాతం ఉండగా, భారతదేశం 39శాతం విధిస్తోంది.
2025 బడ్జెట్‌లో ప్రభుత్వం ఎలక్ట్రానిక్స్, వస్త్రాలు, హై-ఎండ్ మోటార్‌సైకిళ్లతో సహా అనేక ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను తగ్గించింది. ఇప్పుడు వాణిజ్య సంబంధాలను సాధారణంగా ఉంచడానికి భారతదేశం లగ్జరీ వాహనాలు, సౌర ఫలకలు, రసాయనాలపై మరిన్ని సుంకాల కోతలను పరిశీలిస్తోంది. సుంకాల తగ్గింపు భారతదేశ ఆర్థిక వ్యవస్థపై 4 ప్రధాన ప్రభావాలను చూపుతుంది.
– భారతీయ కంపెనీలలో పోటీ పెరుగుతుంది: అమెరికాపై సుంకాలను తగ్గించడం వల్ల ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల దిగుమతి పెరుగుతుంది. భారతీయ కంపెనీలపై విదేశీ బ్రాండ్ల ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఇది కాకుండా, భారతీయ ఆటోమొబైల్ తయారీ కంపెనీలు కూడా నష్టాలను చవిచూసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కంపెనీలలో పోటీతత్వం పెరుగుతుంది. భారతీయ సంస్థలు మరింత పోటీని ఎదుర్కొని, తట్టుకొని నిలబడితే నష్టాల నుంచి గట్టెక్కొచ్చు.
– దిగుమతులు పెరగవచ్చు: భారతదేశం అమెరికన్ వస్తువులపై సుంకాలను తగ్గిస్తే, అమెరికన్ ఉత్పత్తులు భారత మార్కెట్లో చౌకగా మారతాయి. దీని కారణంగా, ఈ వస్తువుల దిగుమతులు పెరిగే అవకాశం ఉంది. అదే సమయంలో భారతీయ మార్కెట్లలో అమెరికా నుంచి తెప్పించుకుంటున్న వస్తువులు మరింత చౌకగా లభించే అవకాశం ఉంది. అంటే ఇతర దేశాలకు చెందిన సంస్థలు కూడా భారత్ లో ఉత్పాదకతకు ముందుకు వచ్చే అవకాశం ఉంది. దీంతో భారత్ లో పెట్టుబడులు పెరగనున్నాయి. అమెరికా సుంకాల నష్టంతో పోల్చుకుంటే ఈ పెట్టుబడుల వరద భారత్ కు లాభాలను చేకూరుస్తుంది.
– రూపాయి బలహీనపడవచ్చు: దిగుమతులు ఎక్కువ కావడం అంటే డాలర్‌కు డిమాండ్ పెరగడం. దీని వలన రూపాయి బలహీనపడి భారతదేశం దిగుమతి బిల్లు పెరుగుతుంది. దీని అర్థం ఇప్పుడు మనం అమెరికా నుంచి వస్తువులు కొనడానికి ఎక్కువ డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. ఇదే సమయంలో ఆర్బీఐ ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచేందుకు, రూపాయి ధరను స్థీరికరించేందుకు పలు చర్యలను నిర్దేశించింది. ఈ చర్యలను ప్రభుత్వం తీసుకుంటూనే రూపాయి ధర బలహీనపడకుండా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అంటే పరిమితుల ప్రకారమే కేంద్ర ప్రభుత్వం సుంకాలను తగ్గించనుంది.
– అమెరికా పెట్టుబడులు తగ్గుతాయి: భారతదేశం సుంకాలను తగ్గిస్తే, అధిక సుంకాలను నివారించడానికి అమెరికా కంపెనీలు భారతదేశంలో ఉత్పత్తిపై దృష్టి పెట్టే అవకాశం లేదు. దీనివల్ల ఆ దేశ ప్రత్యక్ష పెట్టుబడులు అంటే ఎఫ్‌డిఐ తగ్గుతుంది. ఇదే సమయంలో అమెరికా పెట్టుబడులు తగ్గినా, ఇతర దేశాల పెట్టుబడులను పెంచే చర్యలను ప్రభుత్వం ఇప్పటికే చేపట్టింది. దీంతో నష్టాన్ని నివారించొచ్చు.
ఈ పరిణామాలన్నీ ఆలోచిస్తే కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల అమెరికా సుంకాల ప్రకటనతో భారత్ కు ఒక విధంగా నష్టమే అయినా, మరో విధంగా ఆలోచిస్తే నష్టం జరగకపోవచ్చనే ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.