సిరియాలో అంత్యర్యుద్ధం
Civil war in Syria

సైన్యంపై అసద్ మద్ధతుదారుల దాడులు
నాలుగురోజుల్లో వెయ్యిమందికిపైగా మృతి
డమాస్కస్: సిరియాలో మరోమారు గత నాలుగు రోజులుగా తీవ్ర అంత్యర్యుద్ధం చెలరేగింది. సైన్యం, అసద్ మద్ధతుదారులకు మధ్య భారీ ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. ఆదివారం వరకు జరిగిన ఘర్షణలు, ఆందోళనలు, కాల్పుల్లో వెయ్యిమందికి పైగా మృతి చెందినట్లు స్థానిక వార్తా మాధ్యమాలు ప్రకటించాయి. సిరియా నుంచి రష్యా దళాలు వైదొలగడం, ఇరాన్ అసద్ కు మద్ధతు లభించకపోవడంతో ఇదే అదనుగా హెచ్ టీఎస్ నాయకుడు అబూ మొహమ్మద్ అల్-జులానీ తనను తాను సిరియా కొత్త అధ్యక్షుడిగా ప్రకటించుకున్నాడు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రష్యాలో ఉన్న అసద్ మద్ధతుదారులు సైన్యంతో అంత్యర్యుద్ధాన్ని కొనసాగిస్తున్నారు. గతేడాది డిసెంబర్ లో జరిగిన తిరుగుబాటు తరువాత బషర్ (అసద్) దేశం విడిచి పారిపోయాడు. దీంతో ఉగ్రసంస్థ హయత్ తహ్రీర్ అల్ షామ్ అధికారాన్ని కైవసం చేసుకుంది.
లటాకియాలో మాజీ అధ్యక్షుడు బషర్ అల్-అసద్ మద్దతుదారులకు, సిరియాలోని టార్టస్‌కు సైన్యానికి మధ్య గత కొన్ని రోజులుగా ఘర్షణలు జరుగుతున్నాయి. 2011లో సిరియా అంతర్యుద్ధం తర్వాత ప్రస్తుతం మరణాల సంఖ్య అత్యధికం. సిరియాలో యుద్ధాన్ని పర్యవేక్షిస్తున్న సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ అనే సంస్థ ఈ సమాచారాన్ని అందించింది. గత నాలుగు రోజుల్లో, భద్రతా దళాలు అలవైట్ ముస్లిం సమాజానికి చెందిన 745 మందికి పైగా ప్రజలను చంపారు. వారిలో చాలా మందిని ఉరితీశారు. ఇది కాకుండా, 148 మంది అసద్ అనుకూలురు కూడా మరణించారు. అలాగే ఈ హింసలో 125 మంది భద్రతా సిబ్బంది కూడా మరణించారు.
అస్సాద్‌కు విధేయులైన మద్ధతుదారులు భద్రతా దళాలపై దాడి చేయడంతో భారీ హింస చెలరేగగా, భద్రతా దళాలపై బాంబులతో దాడికి పాల్పడి హింసను ప్రేరేపించారని సిరియాలో ప్రస్తుతం కొలువుదీరిన ప్రభుత్వం ఆరోపిస్తుంది. హింస నేపథ్యంలో పలు ప్రాంతాల్లో కర్ఫ్యూను విధించారు. కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేశారు. హింసను నివారించడం ప్రభుత్వానికి సవాల్ గా మారింది. అసద్ 24 ఏళ్లుగా సిరియా అధ్యక్షుడిగా కొనసాగారు. అనంతరం గతేడాది చెలరేగిన హింస తరువాత ఆయన దేశాన్ని వీడారు.