విశ్వామిత్రలా రంగాన్ని మార్చే ప్రయత్నం
మోదీ నేతృత్వంలో నిరుపేదలకు ఆర్థిక స్వావలంభన
2021లో మంత్రిత్వ శాఖ ఏర్పాటు
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: సహకారంతోనే దేశ శ్రేయస్సు ముడి పడి ఉందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పునరుద్ఘాటించారు. ప్రజలను కూడా ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధిలో భాగస్వామ్యం చేసేందుకు సహకార సంఘాలు గొప్ప పాత్ర పోషిస్తున్నాయని అభినందించారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి సహకార రంగాన్ని కూడా విశ్వామిత్రలా మార్చే ప్రయత్నం చేస్తున్నారని కొనియాడారు. మూలధనం లేని ప్రజలను సుసంపన్నం చేయాలన్న ప్రధాని నిర్ణయం హర్షదాయకమని సంతోషం వ్యక్తం చేశారు.
సోమవారం ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలయన్స్ (ఐసీఎ) జనరల్ అసెంబ్లీ, గ్లోబల్ కో–ఆపరేటివ్ కాన్ఫరెన్స్–2024 ఇఫ్కో (ఐఎఫ్ఎఫ్సీవో) వాలంటీర్ల సమావేశం న్యూఢిల్లీలోని భారత మండపంలో జరిగింది. ఈ సమావేశంలో కేంద్రమంత్రి అమిత్ షా ప్రసంగించారు.
సహకార రంగం ఆర్థిక ఉద్యమం..
సహకార రంగాల లక్ష్యాలను సాధించే దిశగా భారత్ ముందుకు వెళుతుందన్నారు. సహకారం ఒక ఆర్థిక ఉద్యమమన్నారు. సహకారానికి భారత్ లో విస్తృత సంప్రదాయాన్ని కల్పించి మరింత బలోపేతం చేసే దిశగా మోదీ ప్రభుత్వం కృషి చేస్తుందని షా తెలిపారు. 2021లో ప్రధాని నేతృత్వంలో సహకార రంగాన్ని మరింత బలోపేతం చేసేలా మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. మూడేళ్లలో తీసుకున్న చర్యలతో సహకార రంగం బలోపేతం దిశగా పయనిస్తుందని పేర్కొన్నారు.
దేశ పౌరులంతా ఆర్థిక పరిపుష్టి సాధించాలి..
సహకార రంగం బలోపేతంతో వెనుకబడిన, అత్యంత వెనుకబడిన, పేదలను అభివృద్ధి పథంలో, అభ్యున్నతి దిశగా నిరంతరం అడుగులు వేస్తున్నామని షా వివరించారు. బలహీనపడుతున్న సహకార సంస్థలను మరింత బలోపేతం చేయడం ద్వారా వ్యాపారం మరింత సరళీకృతం చేయనున్నామన్నారు. సొసైటీలలో పారదర్శకత, పోటీని ప్రోత్సహించడానికి బలమైన పరిపాలనా, విధాన. చట్టపరమైన చర్యలను తీసుకున్నామని తెలిపారు. 140 కోట్ల జనాభా ఉన్నభారత్ లో కేవలం 3, 4, 5 కోట్ల జనాభా ఆర్థిక పరిపుష్టి సరిపోదని అందరూ ఆర్థికంగా ఎదగాలన్నదే తమ అభిమతమని అమిత్ షా అన్నారు. అమూల్ ద్వారా దేశంలో 35 లక్షల మంది సహకార సంఘం ద్వారా ఉపాధి పొందుతున్నాయని అన్నారు.
60కి పైగా కార్యక్రమాలు ప్రారంభం..
సహకార రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రధాని మోదీ నేతృత్వంలో 60కి పైగా కార్యక్రమాలను ప్రారంభించామని తెలిపారు. ఈ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సహకార నాయకులు, విధాన రూపకర్తలు, మానవాభివృద్ధికి పాటుపడుతున్నవారు, న్యాయవాదులు చేతులు కలపవలసిందిగా కేంద్రమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు.