ఓటర్ల ఉత్సాహం విపక్షాల్లో వణుకు

ప్రజాభీష్టం ఎవ్వరికీ తెలియదు ఐక్యతతో పనిచేయాలి నాయకులకు, ప్రజలకు మధ్య వారధులే కార్యకర్తలు నమో యాప్​లో ప్రధాని మోదీ

Apr 3, 2024 - 17:58
 0
ఓటర్ల ఉత్సాహం విపక్షాల్లో వణుకు

న్యూఢిల్లీ: రాజకీయాలను, ప్రజల మనస్తత్వాన్ని పెద్ద పెద్ద నిపుణులు, విశేషజ్ఞులు కూడా ఖచ్చితంగా తెలుసుకోలేరని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గత కొన్నేండ్లుగా జరుగుతున్న ఎన్నికల్లో ఓటర్ల ఉత్సాహంతో విపక్షాల్లో వణుకు పుడుతోందని మోదీ అన్నారు. ‘నమో యాప్’ ద్వారా ఉత్తరప్రదేశ్​లోని బీజేపీ నాయకులను, కార్యకర్తలను ఉద్దేశించి బుధవారం మాట్లాడారు. అసెంబ్లీ, ఎంపీ ఎన్నికల్లో ఓటర్ల ఉత్సాహం వల్లే కొత్త రికార్డులు తిరగరాస్తున్నట్లు వివరించారు. ఓటర్ల ఉత్సాహం అభినందనీయమని మోదీ అన్నారు. ఓటర్లలో నూతనోత్సాహం చూసి కాంగ్రెస్, ఇండి కూటమి పార్టీల్లో వణుకు పుడుతోందని ప్రధాని పేర్కొన్నారు. యూపీలోని బీజేపీ కార్యకర్తలంతా ఐక్యతత పని చేయడం అభినందనీయమన్నారు. తనపై విశ్వాసంతో అన్ని బూత్​లలో విజయానికి తీవ్రంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఓటర్లతో ప్రత్యక్ష సంబంధానికి కార్యకర్తలు చేస్తున్న ఈ కృషిని ప్రధాని కొనియాడారు. ఓటర్ల దృష్టిలో పార్టీ అధినేత అభీష్టాలను నేరుగా ప్రజల వద్దకు చేర్చేవారే కార్యకర్తలని పేర్కొన్నారు. నాయకులకు, ప్రజలకు మధ్య వారధి కార్యకర్తలన్నారు. అసలు వారధే లేకుండా సముద్రాన్ని ఎలా దాటగలమని మోదీ ప్రశ్నించారు. అందుకే కార్యకర్తలకు బీజేపీకి ఆయువుపట్టులాంటి వారన్నారు. 

ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే పోరాటం..

వివక్ష, అవినీతి అంతం, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు మన పోరాటం కొనసాగుతూనే ఉండాలన్నారు. తమ పార్టీలో స్వార్థం లేదని, దేశభక్తి, అభివృద్ధి, దేశ హితం కోసం పనిచేస్తున్నామని ప్రజలకు విడమరిచి చెప్పాలని సూచించారు. ప్రతీ ఒక్క కార్యకర్త మానసికంగా ఆయా విషయాలను ఔపోసన పట్టుకోవాలన్నారు. దేశహితమే మన తొలి ధర్మమని గుర్తుంచుకోవాలన్నారు. ఎన్నికల్లో ప్రచారమే కాకుండా సంస్కృతి, విలువలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ప్రధాని తెలిపారు. 

శాంతి పాలనకు నాందీ..

యూపీ ప్రజలు కుటుంబ రాజకీయాలను ఎప్పుడో తిరస్కరించారన్నది గుర్తెరగాలన్నారు. అదే సమయంలో యూపీలో శాంతి పాలనకు నాందీ పలికామన్నారు. ఆ వాతావరణాన్ని మరింత ఫరిడవిల్లేలా చర్యలు తీసుకుంటామని ప్రజలకు భరోసా కల్పించాలన్నారు. తమ ప్రభుత్వంలో అసాంఘిక చర్యలకు, కార్యకలాపాలకు చోటు లేదన్నారు. అభివృద్ధికి మాత్రమే తాము కట్టుబడి ఉన్నామని, అదే సమయంలో ప్రతీ ఒక్కరికి అన్ని ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలన్నదే తమ ధ్యేయమని చెప్పాలని వివరించారు. 

ఎండల్లో జాగ్రత్తలు పాటించాలి..

ఎండలు మండిపోతున్నందున కార్యకర్తలు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధాని మోదీ కోరారు. కేవలం ప్రచారంపైనే శ్రద్ధ తీసుకోకుండా తమ ఆయురారోగ్యాలపై కూడా శ్రద్ధ వహించాలన్నారు. ద్రవ పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలని సూచించారు. నీటిని అధికంగా తాగాలన్నారు. ఎక్కడికి వెళ్లినా తమ వెంట వీటిని ఉంచుకోవాలని సూచించారు. బీజేపీకి అధికారంలోకి రావడమే ధ్యేయం కాదని, దేశ ప్రజలు పార్టీ కార్యకర్తల ఆరోగ్యారోగ్యాలు కూడా అత్యంత ముఖ్యమని గుర్తుంచుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నమోయాప్​లో స్పష్టం చేశారు.