పశ్చిమ బెంగాల్​ రైలు ప్రమాదం గూడ్స్​ డ్రైవర్​, డివిజన్​ అధికారులదే తప్పిదం

ప్రాథమిక నివేదిక వెల్లడించిన విచారణ బృందం

Jun 20, 2024 - 18:32
 0
పశ్చిమ బెంగాల్​ రైలు ప్రమాదం గూడ్స్​ డ్రైవర్​, డివిజన్​ అధికారులదే తప్పిదం

కోల్​ కతా: పశ్చిమ బెంగాల్​ రైలు ప్రమాదంలో మానవతప్పిదం ఉందని రైల్వే ప్రాథమిక విచారణలో తేలింది. గురువారం ప్రాథమిక విచారణ నివేదికను విచారణ బృందం ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నివేదికలో రైలు ప్రమాదానికి కారణాలను వివరించారు.

ఆరుగురు సీనియర్​ అధికారుల బృందం ప్రమాదంపై  విచారించింది. సిగ్నల్​ ను గూడ్స్​ రైలు డ్రైవర్​ పట్టించుకోకపోవడం, వేగపరిమితిలో నియంత్రణ పాటించకపోవడమే ప్రమాదానికి కారణమైనట్లు వెల్లడించింది. అదే సమయంలో రైల్వే డివిజన్​ ఆపరేషన్స్​ విభాగం నిర్లక్ష్యం కూడా ఉందని తెలిపారు. రాణిపాత్ర, ఛతర్​హాట్​ జంక్షన్​ ల మధ్య మార్గంలో సరైన భద్రతా చర్యలు తీసుకోలేదన్నారు. 

ఆటోమెటిక్​ సిగ్నల్​ ను పట్టించుకోకుండా గూడ్స్​ రైలు డ్రైవర్​ అతివేగంగా వెళ్లాడని పేర్కొన్నారు. సిగ్నల్​ పనిచేయలేదనే ఆరోపణలపై నివేదికలో వెల్లడిస్తూ సిగ్నల్స్​ పనిచేయకుంటే ఒకసారి ఒక రైలును మాత్రమే అనుమతి ఉందన్న నిబంధనను అధికారులు పట్టించుకోలేదన్నారు. ఈ ప్రమాదంపై మరింత లోతైన దర్యాప్తు అవసరమని బృందం నివేదికలో తెలిపింది. ఈ ప్రమాదంలో 10మంది మృతిచెందిన విషయం తెలిసిందే.