బీజేపీకి పదికి పది!
చత్తీస్ గఢ్ లో పత్తాలేని కాంగ్రెస్

కమలదళం దెబ్బకు హస్తం విలవిల
10 కార్పొరేషన్, 36 మున్సిపాలిటీలను చేజిక్కించుకున్న బీజేపీ
పంచాయతీ ఎన్నికలు ఫిబ్రవరి 17, 20, 23న ఆ మరుసటి రోజే ఫలితాలు
రాయ్ పూర్: చత్తీస్ గఢ్ స్థానిక ఎన్నికల్లోనూ బీజేపీ సత్తా చాటింది. కాంగ్రెస్ చతికిలపడింది. 10 కార్పొరేషన్లు, 49 మున్సిపాలిటీలు, 114 పంచాయితీలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ విజయఢంకా మోగించింది. 10కి 10 కార్పొరేషన్లను కమలదళం చేజిక్కించుకుంది. శనివారం ఎన్నికల లెక్కింపు చేపట్టి విజేతలను ప్రకటించారు. హస్తానికి గుండుసున్నానే అందించింది. 49 మున్సిపాలిటీల్లో 36 స్థానాలను బీజేపీ కైవసం చేసుకోగా, కాంగ్రెస్ 7, ఆప్ 1, స్వతంత్రులు ఐదు స్థానాల్లో గెలిచారు. అత్యధిక వార్డుల్లో కమలదళం విజయం సాధించడంతో చత్తీస్ గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్ హర్షం వ్యక్తం చేశారు. అన్ని ప్రాంతాల్లోని బీజేపీ కార్యాలయాల్లో పెద్ద ఎత్తున సంబురాలు నిర్వహించుకున్నారు. మరోవైపు స్థానికంగా ఉన్న పలు కార్మిక సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. అంబికాపూర్, దుర్గ్, రాయ్ గఢ్, జగదల్ పూర్, పాలినగర్, చురికిల నగర్, దీప్కా, కోర్బా, కటిఘోరా వంటి ప్రతిష్ఠాత్మక స్థానాల్లోనూ బీజేపీ విజయదుందుభి మోగించింది.
ఫిబ్రవరి 11న 10 కార్పొరేషన్లు, 49 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. ఫిబ్రవరి 15న (శనివారం) ఓట్ల లెక్కింపు జరిగింది. మొత్తం ఓటింగ్ ప్రక్రియలో 44.74 లక్షల మంది ఓటర్లుండగా, 22.52 లక్షలు పురుషులు, 22.73 లక్షలు మహిళలు ఉన్నారు. పట్టణ సంస్థల ఎన్నికల కోసం ఎన్నికల సంఘం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 597 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. కాగా 114 స్థానాల్లో జరగనున్న పంచాయితీ ఎన్నికలు ఫిబ్రవరి 17, 20, 23 తేదీలు మూడు దశల్లో జరగనున్నాయి. వీటి ఫలితాలను మరుసటి రోజు అంటే ఫిబ్రవరి 18, 21, 24న ప్రకటించనున్నారు. ఈ ఎన్నికల్లోనూ బీజేపీ ప్రభంజనం సృష్టిస్తుందని చెప్పకనే చెప్పొచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.