ఎట్టకేలకు లాభాల్లో బీఎస్ఎన్ఎల్
BSNL is finally in profit

2024–25 క్యూ–3 త్రైమాసికంలో రూ. 262 కోట్లు
గతం నుంచి గుణపాఠం నేర్చుకునే దిశగా ప్రయాణం
వినియోగదారులకు నిలబెట్టుకుంటుందా? జారవిడుచుకుంటుందా?
ప్రైవేటుకు పోటీనిచ్చే సత్తా బీఎస్ఎన్ఎల్ కే
నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: ఎట్టకేలకు 17ఏళ్ల తరువాత బీఎస్ ఎన్ఎల్ (భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్) లాభాల బాట పట్టింది. సంస్థ వెల్లడించిన క్యూ–3 2024–25 మూడో త్రైమాసికంలో రూ. 262 కోట్లు లాభాలను ఆర్జించినట్లు తెలిపింది. మొబిలిటీ, ఎఫ్ టీటీహెచ్, లీజు లైన్ల నుంచి ఆదాయం పెరిగింది. బీఎస్ ఎన్ఎల్ తన ఆర్థిక వ్యయాన్ని కూడా గణనీయంగా తగ్గించుకుంది. సంస్థ 4జీ సేవలు, నెట్ వర్క్ విస్తరణ, ఆప్టిమైజేషన్, వ్యాపార విభాగాలలో వృద్ధితో లాభాలకు ఆస్కారం ఏర్పడింది. ఆర్థిక సంవత్సరం చివరి నాటికి మరో 20 శాం ఆదాయ వృద్ధి ఉంటుందని పీఎస్ యూ అంచనా వేసింది. కాగా ఆర్థిక పనితీరు పట్ల సంతోషంగా ఉన్నట్లు బీఎస్ఎన్ఎల్ సీఎండీ ఎ. రాబర్ట్ రవి చెప్పారు. తమ సంస్థ పనితీరును మెరుగుపరుచుకున్నామనేందుకు నిదర్శనమన్నారు. భవిష్యత్ లోనూ ఇదే దూకుడుతో ముందుకు వెళతామన్నారు. మరిన్ని లాభాలను సొంతం చేసుకుంటామని స్పష్టం చేశారు.
బీఎస్ఎన్ ఎల్ తన కస్టమర్ల కోసం వేగవంతమైన ఇంటర్నెట్, వైఫై, రోమింగ్, బీఐ టీవీ, వినోదం లాంటి సౌకర్యాలను కల్పిస్తూ ప్రైవేటు టెలికాం రంగానికి పోటీగా నిలుస్తుండడంతో క్రమేణా వినియోగదారుల్లో మునుపటి నమ్మకాన్ని దక్కించుకుంటుంది. సంస్థ అందిస్తున్న ప్రయోజనాలతో వినియోగదారులు కూడా సంతోషం వ్యక్తం చేస్తుండడంతో రోజురోజుకు సంస్థకు భారీ సంఖ్యలో వినియోగదారులు చేరువు అవుతున్నారు.
– మొబిలిటీ సేవల ద్వారా ఆదాయం 15 శాతం పెరిగింది.
– ఫైబర్ టు ది హోమ్ ద్వారా ఆదాయం 18 శాతం పెరిగింది.
– లీజ్డ్ లైన్ సేవల ఆదాయం క్యూ–3 కంటే 14 శాతం పెరిగింది.
– బీఐటీవీ, ఐఎఫ్టీవీ, ఎఫ్ టీటీహెచ్ కస్టమర్ల కోసం ప్రత్యేక వినోదం, డిజిటల్ సేవలను అందిస్తుంది.
– పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కనెక్టివిటీ మరింత మెరుగైంది. ప్రైవేటు సంస్థలతో పోలిస్తే బీఎస్ఎన్ఎల్ అందజేస్తున్న కనెక్షన్లు తక్కువ ధరల్లోనే లభిస్తుండడంతో వినియోగదారులకు భారీగా ఈ సంస్థ సేవలపై మొగ్గు చూపుతున్నారు.
గతంలో..
ప్రభుత్వ టెలికాం రంగ సంస్థ నష్టాల్లో ఉండడంతో బీఎస్ఎన్ఎల్ కు అప్పగించారు. అప్పట్లో లోకల్, ఓవైటీ కనెక్షన్లుగా ల్యాండ్ లైన్ కనెక్షన్లు ఇచ్చేవారు. ఓవైటీ కనెక్షన్ కు రూ. 15వేలు చెల్లిస్తే మూడు నెలలు, లోకల్ కనెక్షన్ కు రూ. 3000 చెల్లించి ఆరు నెలలపాటు వేచి చూడాల్సి వచ్చేది. అదీగాక కాళ్ల చెప్పులు అరిగేలా టెలికామ్ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తే గానీ మన కనెక్షన్ కు నెంబర్ వచ్చేది కాదు. దీంతో భారత టెలికామ్ సంస్థ ఏకఛత్రాధిపత్యాన్ని (మోనోపలీ) కొనసాగించింది. క్రమేణా భారతీ జేటీఎం, రిలయన్స్ లు టెలికామ్ సేవల రంగంలోకి దిగాక భారత టెలికామ్ సంస్థ అధికారుల తీరుతో అప్పటికే విసిగి వేసారిన వినియోగదారులు ప్రైవేట్ వైపు మొగ్గు చూపారు. దీంతో ప్రభుత్వ టెలికామ్ సంస్థ కాస్త పూర్తిగా కుప్పకూలింది. ఇక అలక్ష్యం చేయొద్దని బీఎస్ఎన్ ఎల్ కు అప్పగించారు. ఆ సేవలు కాస్త అంతంతమాత్రంగానే ఉండడంతో అంతకుముందు అనుభవాలను కూడా దృష్టిలో ఉంచుకున్న వినియోగదారులెవ్వరూ ఆసక్తి ప్రదర్శించలేదు. దీంతో ఒకానొక సమయంలో కార్యాలయంలో టేబుల్ పై కాళ్లేసుకొని కూర్చున్న అధికారులు కాస్త రోడ్డు మీద టెంట్లు వేసుకొని కనెక్షన్ లు జారీ చేస్తామన్న ఎవ్వరూ తీసుకునే వారు కాదు. 2014 తరువాత మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డిజిటల్ రంగానికి, ప్రభుత్వ సంస్థల బలోపేతాన్ని చేయాలని నిర్ణయించింది. వినియోగదారుల సేవలకే ప్రథమ ప్రాధాన్యతనిస్తూ మార్పు చేర్పులకు శ్రీకారం చుట్టింది. దీంతో 17 ఏళ్ల సుధీర్ఘ ప్రయాణంలో ఇప్పటికి గానీ బీఎస్ ఎన్ ఎల్ లాభాల బాట పట్టలేకపోయింది. వినియోగదారుల నమ్మకాన్ని చూరగొనలేకపోయింది. మొత్తానికి ప్రస్తుతం లాభాల్లో ఉన్న బీఎస్ ఎన్ ఎల్ ఇలాగే మెరుగైన పనితీరును ప్రదర్శిస్తే ప్రైవేటు టెలికాం సంస్థలకు భారీ పోటీ తప్పదనే చెప్పొచ్చు.