ఉగ్రవాదులకు ఊతం ఇస్తున్న టీఎంసీ
మమత సర్కార్ పై బీజేపీ గరం గరం
కోల్ కతా: పశ్చిమ బెంగాల్ మమత ప్రభుత్వంపై బీజేపీ నేత సుబేందు అధికారి తీవ్ర విమర్శలు గుప్పించారు. మంగళవారం మీడియాతో మాట్లాడారు. మమత ప్రభుత్వం ఉగ్రవాదులకు ఊతం ఇచ్చేలా ప్రవర్తిస్తుందన్నారు. దీంతో దేశంలో అసాంఘిక శక్తులకు అడ్డాగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. దేశంలో ఎక్కడ ఉగ్రవాదులు, నకిలీ కార్డుల వ్యవహారాలు, అరెస్టులు వెలుగుచూసినా వాటి మూలాలు పశ్చిమ బెంగాల్ లో లభించడం మమత ప్రభుత్వ చర్యలకు నిదర్శనమన్నారు. సమయానికి దర్యాప్తు బృందాలు, పోలీసులు అరెస్టులు చేస్తుండడంతో దేశంలో భారీ ఉపద్రవాలనే నివారించగలుగుతున్నారన్నారు. కోల్ కతా వైద్యురాలిపై లైంగిక దాడి, హత్య, విదేశాల దౌత్యకార్యాలయాలపై దాడులు, కేంద్ర దర్యాప్తు బృందాలపై దాడులు చేస్తూ మమత సర్కార్ ప్రత్యక్షంగానే దేశద్రోహ ఘటనలకు పాల్పడుతుందన్నారు. బంగ్లా తీవ్రవాద సంస్థ ‘అన్సరుల్లా బంగ్లాదేశ్ టీమ్’తో సంబంధం ఉన్న అనుమానితులు పశ్చిమ బెంగాల్ లో అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ర్ట ప్రభుత్వం రాష్ర్ట భద్రత విషయంలో పనిచేయకుండా, కేంద్ర దర్యాప్తు సంస్థలను కూడా పనిచేయనీయకుండా అడ్డుపుల్ల వేస్తుందని మండిపడ్డారు.పశ్చిమ బెంగాల్ లో బంగ్లాదేశీయులు అక్రమ పేర్లు, కార్డులతో అనేకమంది నివసిస్తున్నారని వారికి మమత సర్కార్ వంతపాడుతుందని సుబేందు మండిపడ్డారు.