చత్తీస్​ గఢ్​ లో భారీ ఎన్​ కౌంటర్​ 30 మంది మృతి

ఒక జవాను వీరమరణం

Mar 20, 2025 - 17:09
 0
చత్తీస్​ గఢ్​ లో భారీ ఎన్​ కౌంటర్​ 30 మంది మృతి

భారీ ఎత్తున ఆయుధాలు స్వాధీనం
2025లో 71 మంది నక్సల్స్​ హతం
నక్సల్స్​ రహిత దేశంగా రూపుదిద్దుతామన్న కేంద్రమంత్రి అమిత్​ షా

రాయ్​ పూర్​: చత్తీస్​ గఢ్​ బీజాపూర్​ లోని బస్తర్​ ప్రాంతంలో భారీ ఎన్​ కౌంటర్​ జరిగింది. గురువారం రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఎన్​ కౌంటర్​ లో మొత్తం 30 మంది నక్సలైట్లు మృతి చెందినట్లు, ఒక డీఆర్జీ జవాను వీరమరణం పొందినట్లు బస్తర్​ ఐజీ సుందర్​ రాజ్​ తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు బీజాపూర్​–దంతేవాడ సరిహద్దులో కూంబింగ్​ చేపట్టగా నక్సలైట్లు కాల్పులకు పాల్పడ్డారని తెలిపారు. ఎదురుకాల్పుల్లో 26 మంది నక్సలైట్లు మృతిచెందినట్లు వివరించారు. కాంకేర్​–నారాయణ్​ పూర్​ సరిహద్దులో మరో ఎన్​ కౌంటర్​ లో నలుగురు నక్సలైట్లు మృతిచెందినట్లు వారి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు ఐజీ వివరించారు. భారీ ఎత్తున వీరి నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. నారాయణ్​ పూర్​–దంతేవాడ సరిహద్దు తుల్తులిలో ఐఇడీ పేలడంతో ఇద్దరు సైనికులకు గాయాలయ్యాయన్నారు.

ఒక రోజు ముందే అందిన విశ్వసనీయ సమాచారం మేరకు గంగలూరు ప్రాంతంలో పెద్ద ఎత్తున నక్సలైట్లు ఉన్నట్లుఎస్పీ గౌరవ్​ రాయ్​ తెలిపారు.  దీంతో డీఆర్జీ, పోలీసులు సంయుక్తంగా కూంబింగ్​ ఆపరేషన్​ ప్రారంభించామన్నారు. కాగా చుట్టుపక్క ప్రాంతాల్లో ఇంకా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు, ఎన్​ కౌంటర్​ ఇంకా కొనసాగుతుందని బీజాపూర్​ ఎస్పీ జితేంద్ర యాదవ్​ తెలిపారు. 

2025లో నక్సల్స్​ వ్యతిరేక ఆపరేషన్​ లు..
– ఫిబ్రవరి 9న బీజాపూర్​ జిల్లా ముద్దేడ్​–ఫర్సేగఢ్​ బోర్డ్​ ఎన్​ కౌంటర్​ లో 31 మంది నక్సలైట్లు మృతి చెందారు.
– ఫిబ్రవరి 2న బీజాపూర్​ గంగటూరు ప్రాంతంలో 8 మంది నక్సలైట్లు ఎన్​ కౌంటర్​ లో మరణించారు.
– 20–21 జనవరిన చత్తీస్​ గఢ్​–తెలంగాణ సరిహద్దులో కాంకేర్లోని​ పూజారి గ్రామంలో జరిగిన ఎన్​ కౌంటర్​ లో 18 మంది నక్సలైట్లు మృతిచెందారు. 
– 12 జనవరి బీజాపూర్​ ముద్దేడ్​ ఎన్​ కౌంటర్​ లో ఇద్దరు మహిళా నక్సల్స్​ సహా మొత్తం ఐదుగురు మృతిచెందారు.
– జనవరి 9న సుక్మా–బీజాపూర్​ సరిహద్దులో ముగ్గురు నక్సలైట్లు ఎన్​ కౌంటర్​ లో మృతి చెందారు.
– జనవరి 6న ఐఈడీ బ్లాస్ట్​ లో 8 మంది జవాన్లు మృతి చెందారు. 
– జనవరి 4న అబూజ్​ మడ్​ అడవుల్లో జరిగిన ఎన్​ కౌంటర్​ లో ఒక మహిళా నక్సలైట్​ సహా ఐదుగురు మృతి చెందారు. ఒక డీఆర్జీ జవాను కూడా మరణించాడు.

2025లో జరిగిన ఎన్​ కౌంటర్​ లలో మొత్తం 71 మంది నక్సలైట్లు మృతి చెందగా, 290 అత్యాధునిక ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. 2024లో 300మంది నక్సలైట్లు హతమయ్యారు. 

హోంమంత్రి అమిత్​ షా..
కాగా ఈ రెండు ఎన్​ కౌంటర్​ లపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​ షా స్పందించారు. నక్సల్స్​ రహిత దేశంగా తీర్చిదిద్దుతామన్నారు. ఇది భద్రతా దళాల పెద్ద విజయంగా అభివర్ణించారు. నక్సలైట్లపై మోదీ ప్రభుత్వం ఓ వైపు స్పష్టమైన విధానంతో ముందుకు పోతూనే హింసకు పాల్పడే వారి పట్ల మాత్రం కఠిన వైఖరికి కట్టుబడి ఉందన్నారు. ఇప్పటికైనా నక్సల్స్​ తమ విధానాలను మార్చుకొని ప్రభుత్వానికి లొంగిపోయి ప్రజా జీవనంలోకి రావాలన్నారు. మార్చి 31 నాటికి దేశాన్ని నక్సల్స్​ రహితంగా మారుస్తామని పునరుద్ఘాటించారు.