లైంగికదాడి.. కాంగ్రెస్ ఎంపీ అరెస్ట్!
Sexual assault.. Congress MP arrested!
లక్నో: ఉత్తరప్రదేశ్ సీతాపూర్ కాంగ్రెస్ ఎంపీ రాకేశ్ రాథోడ్ ను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఆయనపై లైంగిక దాడి కేసులో సోమవారం అరెస్టు వారెంట్ కోర్టు జారీ చేసింది. అప్పటి నుంచి పోలీసులు ఆయన కోసం వెతుకుతున్నారు. గురువారం ఆయన సమాచారం అందుకున్న పోలీసులు ఇంటి నుంచే ఎంపీని అరెస్టు చేశారు. గత నాలుగేళ్లుగా లైంగికదాడి చేస్తూ తప్పించుకునందుకు తనను పెళ్లి చేసుకుంటానని మభ్యపెట్టినట్లు కోర్టులో ఓ మహిళ పిటిషన్ దాఖలు చేసి, పలు ఆధారాలను కూడా అందించింది. దీంతో మహిళ ఆరోపణలపై విచారణ చేపట్టి కేసు నమోదు చేసి వివరాలు కోర్టుకు సమర్పించారు. విచారించిన కోర్టు పలుమార్లు ఆరోపణలపై వివరణ ఇవ్వాలని ఎంపీకి నోటీసులు జారీ చేసింది. ఎంపీ విచారణకు హాజరుకాకపోవడంతో కోర్టు సోమవారం ఆయన అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఎంపీ రాథోడ్ కేసులో రాజీకి రావాలని బెదిరిస్తున్నారని మహిళ భర్త కూడా పోలీసులకు ఫిర్యాదు చేసి తనకు వచ్చిన ఫోన్ కాల్ వివరాలను అందించాడు. కాగా బుధవారం ఎంపీ అలహాబాద్ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసుకోగా అది తిరస్కరణకు గురైంది. సీతాపూర్ ఎంపీ, ఎమ్మెల్యే కోర్టులో కూడా ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ రద్దయ్యింది.